Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంటే, నా పెట్టుబడి గ్రంథమూ, రెడ్డిగారి పెట్టుబడి దాని ప్రకటన క్కావలసిన డబ్బూను.

ఇదే భంగ్యంతరంగా చెప్పాలంటే, నా పుస్తకం అచ్చువేయించి అమ్మకానికి సిద్ధం చెయ్యడానికి రెడ్డిగారెంత పెట్టుబడి పెడతారో, నా రెమ్యూనరేష సంతన్నమాట.

గ్రంథం ప్రకటించినప్పుడల్లా సంస్థకు మూలధనం పెరుగుతూనూ వుంటుం దన్నమాట.

మరి, చెన్నుభొట్లవారి మాటేమిటంటే, పుస్తకా లమ్మడం వారివిధి.

అమ్మకంమీద నూటికి నలభైరూపాయల కమీషను మాత్రమే వారికి ప్రతిఫలం.

ఆఫీసులో అమ్మే పుస్తకాలకూ, వీపీలద్వారా అమ్మే పుస్తకాలకూ గూడా ఆ రేటున వారి క్కమిషనివ్వవలసిందే.

డిస్కవుంటిచ్చి బుక్సెల్లర్లకు పుస్తకా లమ్మినా వారి కమిషను తప్పదు.

అయితే, యిందులో వొక విశేషం.

ప్రతీ పుస్తకమూ మేము రెండేసి వేల ప్రతు లచ్చు వేయించాలి.

ఆ రెండువేల ప్రతులూ చెన్నుబొట్లవా రమ్మాలి.

అమ్మి తీరాలి.

అమ్మాలంటే, వూరూరూ తిరిగి - ఒకచోట అంగడి పెట్టి కాదు.

అలా తిరగడం రామచంద్రపురం తాలూకా వూళ్ళన్నీ తిరగాలి, ముందు.

అంటే, సంస్థ కాయన ట్రావెలింగు ఏజం టన్నమాట, ఇటు పోల్ ఏజెంటు కావడంతోపాటు.

ఏజెంటు అన్నది గౌరవాస్పదం కాదుట, అంచేత ట్రావిలింగు ఇన్‌స్పెక్ట రనాలి మేము.

ఖర్చులయినా ప్రతిఫలమయినా అంతా ఆయనకా కమిషనే.

కాగా, - సంస్థ అంటే మేము ముగ్గురమూను.

భాగస్వామ్యం మాత్రం నాదీ రెడ్డిగారిదిన్నీ.

పోతే, - రెడ్డిగారికి లేని అదనపు బాధ్యత నాకు రాజమండ్రిలో వుండి ఆఫీసు నిర్వహించడం.

అందుకోసం, సంస్థ, నాకు నెలకింత అని యిస్తుంది.

అన్నిటికీ ప్రధానమైన నిబంధన - లాభం రాకపోతే - సంస్థ నిలిపివెయ్యవలసిన అవస్థ వస్తే అప్పటికి మిగిలివుండిన పుస్తకాలు నేనూ రెడ్డిగారూ చెరిసగం పుచ్చుకోవడం.

“ఇది చూస్తే, చెన్నుభొట్లవారి చేరికవల్ల యేమిచిక్కు వస్తుందీ!" అనిపిస్తుం దెవరికయినా.

కాని, అంతా సిద్ధం అయినాక - రాజమండ్రీ ప్రవేశించి నే నాఫీసున్నూ తెరిచాక, వొక వింత కోరిక వెల్లడించా రాయన.

ఊళ్లల్లో తిరిగేటప్పుడు, తమ పని నిరూఘాటంగా సాగాలంటే, తమ్ము చూసి జనులు విభ్రాంతులయిపోవాలి కనక, తమవెంట వొక బిళ్ళబంట్రో తుండాలిట వారికి.

399

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి