వేదులవారికి పాతికరూపాయలు పెట్టి బరంపురం తాపితా కొని యిచ్చి, పాతికా నాకు రొక్కమే యిచ్చారు సూర్యనారాయణశాస్త్రిగారు.
ఊరివారు అష్టావధానం ముగిసిన వొకగంటకి మరో పాతిక తెచ్చియిచ్చారు, చందాలు వేసుకుని.
చూసి నేను మనసుపడగా, నిలువుపొడుగున్న పాలకర్ర కూడా ఇచ్చారు సూర్యనారాయణశాస్త్రిగారు నాకు.
నా చేతిలోనే వుందది ఆ సమయాన.
బజారుపని ముగించుకుని మళ్ళీ యేడుగంటల రెయిల్లో బయలుదేరి అనపర్తిలో దిగీ, తొమ్మిదింటికి మహేంద్రవాడ వెళ్ళే ప్రయత్నంలో వున్నా న్నేను.
అంచేత రాజమండ్రీ స్టేషన్నుంచి మిక్కిలీ వడిగా వెడుతున్నాను, బజారుకేసి.
తాలూకా ఆఫీసు దాటాను, "నమస్కారం సుబ్రహ్మణ్యశాస్త్రిగారూ, నుంచోవా లొక్కక్షణం" అంటూ యెవరో పిలిచారు నన్ను.
చూడగా, పందిరివారి అరుగుదిగి యెవరో వస్తున్నారు నాకేసి.
"నన్ను మీ రెరగరు. మిమ్మల్ని నే నెరుగుదును. నా పేరు శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి " అంటూ దగ్గిరికే వచ్చా రింతలో వారు.
“మానేపల్లి కంపెనీహాలు (పక్కనే వుంది) లో మైలవరం నాటక సమాజంవారివాళ నా సావిత్రి ఆడుతున్నారు. ఉండి మీరు చూసి వెళ్ళా" లన్నారు సచ్చిదానందశాస్త్రిగారు.
నా పనితొందర విన్నవించి క్షమించమంటున్నా న్నేను.
"మీరేనా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగా రంటే?" అంటూ మరో కంఠం వినవచ్చిందింతలో నాకు.
చూడగా, ఎర్రశాలువు బుజాన వేసుకునివున్నవా రెవరో వస్తున్నారు నాకేసి.
“నేను చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిని లెండి" అంటూ దగ్గరకే వచ్చారు వా రింతలో.
“నమస్కారం” అన్నా న్నేను.
ఆశీర్వదించలేదు సరిగదా, తిట్లకు లంకించుకున్నారు వేంకటశాస్త్రిగారు.
తెల్లపోయా న్నేను.
ఇంతలో చాలామంది చేరా రక్కడ.
అటూ యిటూ రోడ్డే వెళ్ళేవారున్నూ ఆగిపోయారు.
అలా తిడుతూనే వున్నారు వేంకటశాస్త్రిగారు, మరో మాట లేదు.
ఇక లాభం లేదని నేనూ ప్రారంభించాను, తిట్టుకుతిట్టు.
“నా పుస్తకాలు విమర్శిస్తావా?" అని వారి దబాయింపు.
"ఆకాశంనుంచి వూడిపడ్డాయా నీ పుస్తకాలు, మహా?" అంటూ నా బుకాయింపు.
“సభ చేయిస్తాను వస్తావా?" అనడిగా రాయన.
"మగతనం వుంటే చెయ్యవలసిన పని అదీ. ఈ తిట్లేవిటి క్షుద్రజాతి మనిషిలాగ?" అని బదులడిగా న్నేను.
389
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి