Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్క డెక్కడి పల్లెటూళ్ళవారికీ గూడా గొప్పగొప్ప పండితుల దర్శనభాగ్యం పట్టే దీరూపంగా.

ఆ పండితుల శిష్యులకు విద్యాస్పర్థ ఎక్కువ అయేది, భిన్న స్థలాల విద్యార్థుల సమాయోగంతో.

యోగ్యుడైనవాడికి "పైకి వస్తున్నా” డన్న ఖ్యాతీ ప్రారంభం అయేది, విద్యార్థిదశలోనే అప్రయత్నంగా.

ఊరి యువకులకున్నూ విద్యలయెడల శ్రద్ధాసక్తులు పుట్టడమే కాదు, ఏ విద్యకోసం యెక్కడికి వెళ్ళాలో, యెవరి నాశ్రయించాలో తెలిసిపోయేది.

భుజంగరావు పంతులుగారు వైదిక విద్యల నాదరించకపోలేదు; గాని తమ శ్రద్ధాసక్తులు కవుల యెడల యెక్కువగా కనబరిచేవారు.

కూచిపూడి భాగవతులనున్నూ ఆహ్వానించేవారు వారు.

కూచిపూడి వారి విద్వత్తు సంప్రదాయసిద్ధమూ సర్వతోముఖమూ అన్న విషయం అక్కడే అవగాహన అయింది, నాకు మొదట.

భుజంగరావు పంతులుగారు జమీందారు మాత్రమే కారు, సరసులు.

సరసులు మాత్రమే కారు, మహోదారులు.

మహోదారులున్నూ మాత్రమే కారు, పండితులు.

పండితులు మాత్రమున్నే కారు, కవులు.

శొంఠి భద్రాద్రిరామశాస్త్రిగారు ఆస్థానపండితులూ, ఆస్థాన కవులూ, కవితాగురువులున్నూ వారికి.

నేను రాసిన వారకాంత అనే నాటకం, "వారకాంత" అనే ఆ భుజంగరావుపంతులుగారి చాటు ప్రబంధకథ ననుసరించినదే.

పుంజీలమీదా, పదులమీదా మాత్రమే కాదు, వందలమీద వచ్చేవారు, వారు జరిగించిన వివాహమహోత్సవాలకు కవులు.

వారిలో వేదం వేంకటరాయశాస్త్రిగారూ, వడ్డాది సుబ్బారాయుడుగారూ వంటివారితోపాటు అప్పు డప్పుడే పద్యబంధం ప్రారంభించినవారిదాకా, అన్ని అంతస్థులవారూ వుండేవారు.

వచ్చినవారి నందరినీ రాకపోకల ఖర్చులిచ్చి శాలువులతో సత్కరించేవారు భుజంగరావుపంతులుగారు.

శాలువులంటే అచ్చంగా అవి శాలువులే, కద్దరు దుప్పట్లూ, శ్రీ విశ్వనాథసత్యనారాయణగారి పరిభాష ననుసరించి వడియాల గుడ్డలూ కావు.

అలాంటి సరసులు పూనుకోడంవల్ల విశ్వసుందరరావుగారి వివాహం సందర్భంలోనూ చాలా ఘనంగా జరిగింది కవి సమ్మేళనం.

ఆ సందర్భంలోనే చూశాను, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి న్నేను.

దూరంగా చూడ్డంమట్టుకే జరిగింది, వారి దర్శనం చేసుకుని సావకాశంగా మాట్టాడ్డం పడలేదు నాకు.

కాని, అనేకలు చెప్పా రెన్నోమాట్లు, వేంకటశాస్త్రిగారి దగ్గిర పౌరుష్యం యెక్కువ అని.

387

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి