Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ పళ్ళే లందుకోడానికి మొదటి అధికారులు వేదాలు నేర్చి యజ్ఞయాగాలు చేసినవారు.

యజ్ఞయాగాలు చేసినవారికి "ఆహితాగ్నులు” అని వ్యవహారం.

విద్వదాహితాగ్నుల తరవాత చదువుసంధ్యలు లేని ఆహితాగ్నులది, వారి తరవాత వేదార్థవేత్తలదీ, వారి తరవాత వేదపాఠకులదీ, వారి తరవాత శాస్త్రాలు నేర్చినవారిదిన్నీ ఆ అధికారం.

ఆ పళ్ళేలందుకుని ఘన, జట, క్రమం - ఇత్యాది విభాగాలతో వేదమంత్రాలు - కాలికాలయిన పనసలు చెప్పి వారు వధూవరుల నాశీర్వదిస్తారు.

శాస్త్రవేత్తలున్నూ యిలాంటి సందర్భాలకోసం కొన్ని పనసలు వల్లించుకుని వుంటారు.

అలా ఆశీర్వదించిన వారిని - అంటే పళ్ళేలు చెప్పినవారిని వరపక్షంవారు, శాలువలు - కాసులు - వరహాలు - జామార్లు - ఇలాంటి కాన్కలతో సత్కరిస్తారు.

ఏ చదువూ -అంటే యే వైదికవిద్యా రానివారికి దొడ్డి సంభావన.

బ్రాహ్మలుగదా - తీరా వచ్చారుగదా - ఎంతోకొంత ఖర్చు పెడుతూనే వున్నాంగదా - నోటితో లేదనడం యెందుకూ అన్న ఉదారబుద్ధితో యిస్తా రిది సంపన్నులు.

ఆదిలో, అప్పుడప్పుడే విద్యాభ్యాసం ప్రారంభించివుండిన - గుర్తించతగ్గ వొక అంతస్థుకి రాని బ్రాహ్మణబాలురకోసం వుద్దిష్టం యీ దొడ్డిసంభావన.

కాని, యిప్పుడు ఈ దొడ్డిసంభావన పుచ్చుకుంటున్నవారిలో బహూ కొద్దిమంది మాత్రమే యిందు కర్హులుగా వున్నారు.

అనర్హుల కివ్వడం సదస్యం వుద్దేశానికే ప్రతికూలం.

వెనకటికి, సదప్యం జరిగించేవారు కవులనూ సత్కరించేవారు.

అందుకోసం యేర్పడ్డదే "కవిత్వప్పళ్ళెం.”

వేదవేదాంగవేత్తల కందించినట్టు కాక, పురోహితుడు, కవుల నాహ్వానిస్తూ అక్షతల పళ్ళెం వొకచోట వుంచుతాడు, సభలో.

అప్పు డాసభలో వున్న కవులు “ఆ పళ్ళెం అందుకునే అర్హత నాకే వుందంటే, నాకే వుం" దంటూ యెగబడతా రెవరికివారే.

ఆశుకవిత్వం, చిత్రకవిత్వం, బంధకవిత్వం, సమస్యాపూరణం, నిర్దిష్టాక్షరి, చర్చ - ముఖ్యంగా బుకాయింపు - ఇలాంటి విధానాలతో కవుల కక్కడ తారతమ్యపరీక్ష.

అందులో నెగ్గినవా రందుకునేవా రాపల్లెం, భూరిసంభావనతో పాటు.

వీగిపోయినవారికీ జరిగే దీసత్కారం, విజేతల కిచ్చినదానికంటే, కొంచెం తక్కువగా.

ఇందులో, కవిత్వం విషయమై సరైన జ్ఞానం లేకపోడం స్పష్టంగానే కనపడుతోంది; కాని రానురాను, కవులకు, ఆమాత్రపు సత్కారమున్నూ అంతరించిపోయింది.

ఇలాగ కవిత్వప్పళ్ళేల పద్ధతి అప్పుడు వెనకబడితే, సదస్యం పద్ధతే యిప్పుడు వెనకబడిపోతోంది, అనవసర వ్యయం అన్న నిర్ధారణతో.

జాతికీ, జాతీయ సంస్కారానికీ పతనం కాని అభ్యుదయం కా దిది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

384