Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ద్వారా వారితో నాకు పరిచయం.

సూర్యప్రకాశరావుగారితో పరిచయమే రాజకీయాలన్నా రాజకీయ సభలన్నా నాకు రుచిపుట్టించింది.

"గోదావరీ మండలసభ” అంటూ వొక రాజకీయసభ నడిపించేవారు వారు.

ఏటా వార్షిక సమావేశాలు జరిగేవి దానికి.

నే నెన్నో సమావేశాలకు వెళ్ళాను, వారి ప్రోత్సాహంతో.

పని ముగిసింది, "రండి, పోలవరం జమీందారుగారి దగ్గిరికి వెడదాం" అంటూ బయలుదేరారు, సూర్యప్రకాశరావుగా రావేళ.

మేము వెళ్ళేటప్పటికి (మధ్యాహ్నం రమారమీ 4 గంటలవేళ) జమీందారుగారి భవంతి అరుగుమీద తిరుపతిశాస్త్రిగారు పచారుచేస్తున్నా రేదో ఆలోచించుకుంటూ.

దూరంగా చాలామాట్లు చూసివున్నా న్నేనప్పటికి వారిని.

ముందు ప్రకాశరావుగారూ, తరవాత నేనూ వందనాలు చెప్పుకున్నాం వారికి.

ఆశీర్వదించి “వా రెవ" రని నన్ను నిర్దేశిస్తూ తిరుపతి శాస్త్రిగా రడగడమూ “అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. మీకు శృంఖలాలు తగిలించినవారే వీరు" అంటూ ప్రకాశరావుగారు చెప్పడమూ గబగబా జరిగిపోయాయి.

"అయితే, మా శత్రుకోటిలో వారే అన్నమాట" అన్నారు శాస్త్రిగారు వెంటనే, ముందు.

కాని అంతలో యేమనుకున్నారో యేమో "కాదుకాదు, మా పొరపాట్లు చూపించినవారు మిత్రకోటిలోవా రవుతారు గాని శత్రుకోటిలోవా రెలా అవుతారూ?" అన్నారు, తరవాత.

చకితుణ్ణయినా న్నేను.

ప్రకాశరావుగా రింతలో జమీందారుగారి దగ్గిరకు వెళ్ళగా "రండి" అంటూ నన్ను పిలిచి, తా మక్కడ వుండిన బల్లమీద కూచుని, నాకున్నూ పక్కనే స్థలం నిర్దేశించి సంభాషణ ప్రారంభించారు శాస్త్రిగారు.

వారు ఘర్షణ పెంచుతా రనుకుని అందుకు సావధానుణ్ణయే కూచున్నా న్నేను; కాని వారు చాలా ఉదాత్తంగా ప్రారంభించారు సంభాషణ.

నే నప్పటి కేమేమి రచించివున్నానో తెలుసుకున్నారు.

అప్పుడేమి రచిస్తున్నానో అడిగారు.

నాలుగైదు పద్యాలు చదివించుకుని విన్నారు.

అప్పటికి జ్ఞాపకం రాగా, తమ శిష్యుడు మల్లాది సత్యనారాయణశాస్త్రి నా గురువరణవిధానం తమకు చెప్పివుండినట్టు చెప్పారు.

"సంధ్యావందనం అంటే అంత ద్వేషం యేమీ?" అనడిగారు.

శృంఖల రాయవలసిన అగత్యం నా కేమి వచ్చిందో చెప్పమన్నారు.

చివరికి "మీ గురువులు చెప్పిందేమాట. ఈ వ్యవహారంలో దిగడం మీ కనవసరం" అన్నారు.

మొత్తం రమారమీ రెండుగంటలసేపు మాట్లాడుకున్నాం మే ముభయులమూ.

381

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి