Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది రచించడంలోనూ, వేంకటశాస్త్రిగారి తృణీకరణం ఖండించడంలోనూ నే నెంతో సాధన చెయ్యవలసివచ్చింది మరి, ఏకాగ్రంగా.

ఆ పునాదిమీద నా సాధనకు మించిన నిర్మాణాలు చెయ్యడానికి తగ్గ శక్తి కలిగింది నాకు.

కాగా, అది రచించినందు కిప్పటికీ నేను కించపడ్డంలే దేకొంచెమున్ను.

58

శృంఖలాతృణీకరణం చూసి వొకవిధంగా నవ్వుకున్నా న్నేను.

వెంటనే దానిమీద ఖండన రాయడానికిన్నీ పూనుకున్నాను.

నా రచనపేరు "గళహస్తిక.”

మొదట నే నిచ్చిన శీర్షికల్లో ఏయేనెంబర్లకు వేంకటశాస్త్రిగారు జవాబులు రాయలేదో చూపించి "యిందుకేం చెబుతా" రని నిక్కచ్చిచేశాను.

వా రిచ్చిన జవాబుల్లోనూ అనేకా లెంత అసందర్భంగా వున్నాయో సహేతుకంగా నిరూపించాను, తరవాత.

వారి జవాబుల్లో కొన్ని అంగీకరించి, నా పొరపాట్లున్నూ వొప్పుకున్నాను, చివరికి.

ఇక సాపు రాయడమే తరువాయిగా వుండగా, వొకమాటు గురువులకు చూపిద్దామని పిఠాపురం పట్టుకువెళ్ళా నది.

28 అరటావులు - అంటే యెడాపెడా 56 పేజీల గ్రంథం అది.

అచ్చులో 80 పేజీ లవుతుంది, బిగిసి.

గురువు లిద్దరూ కూచున్నారు పరిశీలనకు.

సమయానికి ఆకొండి కామరాజుగారున్నూ వచ్చారు.

రెండుమూడు గంటలసే పదే పనయింది మా కాపూట.

రామకృష్ణశాస్త్రిగారు స్వయంగా చేతబుచ్చుకుని చదివా రది.

"ఒకటి రెండుచోట్ల మీ సమర్థనం చాలదు" అని, "అయినా నే నొకటి చెబుతాను వింటారా?" అనడిగారు చదవడం పూర్తిచేసి.

అది ప్రకటించవ ద్దంటారు వారు, అనుకున్నదే.

“అయినా, సెలవిప్పించండి" అన్నా న్నేను.

అన్నాను - అంతే, నిలువుగా రెండు చీలికలు చేసేశారు వెంటనే వా రది.

చకితుణ్ణయినాను నేను.

"అదేమిటీ?" అంటూ తెల్లపోయారు కామరాజు గారున్నూ.

ఇది చాల దన్నట్టు “భీష్, మంచిపని చేశా" వన్నారు వేంకటరామశాస్త్రిగారు.

"నే నిలా చెయ్యడం కష్టంగానే వుంటుంది మీకు” అంటూ ప్రారంభించా రప్పుడు రామకృష్ణశాస్త్రిగారు, మెల్లిగా.

"గ్రంథకర్తలకు స్వాతంత్ర్యం వొక్కటే కాదు, బాధ్యత వుం దెంతో. 'నిరంకుశాః కవయః' అన్నమాట యెరుగుదును; అయితే, దాని కతివ్యాప్తి పట్టకుండా చూసుకోవాలి కవి అయినవాడు. ఔచిత్యం భంగపడనంతవరకే ఆ నిరంకుశతకు

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

370