Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"శృంఖలాతృణీకరణం" అని పేరుపెట్టి, వేంకటశాస్త్రిగారు, నా విమర్శమీద ఖండన ప్రారంభించారా పత్రికలో.

వేంకటశాస్త్రిగారి శిష్యులు కస్తూరి శివశంకరకవిగారు తమ సుదర్శనిపత్రికలో విమర్శ ప్రారంభించారు, నరసాపురంలో.

“ఇక్కడ తిరుపతివేంకట కవులు పొరపడ్డారు, సందేహం లేదు; కాని సుబ్రహ్మణ్యశాస్త్రిగా రిక్కడ తప్పుకానిది తప్పన్నారు. దానికీ దీనికీ చెల్లు” - ఈ ధోరణిలో నడిచింది, శివశంకరకవిగారి విమర్శ.

వేంకటశాస్త్రిగారు మాత్రం ఖండించినంతవరకూ “ఘాటుగానే ఖండించారు.

"ఘాటుగా" అంటే బుకాయిస్తూ అన్నమాట.

ఇక “ఖండించినంతవరకూ" అనెందు కన్నానంటే, నా ఆక్షేపణల్లో, సగానికయినా వారు బదులుచెప్పలేదు.

పైగా క్రమం విడిచి అక్కడొకటీ యిక్కడొకటీ ఆక్షేపించి ఖండించేశా ననిపించుకున్నా రాయన.

నా విమర్శ అంతా ఖండించేసినట్టు లోకాన్ని భ్రమ పెట్టడాని కాయన ప్రయత్నం.

పాణిగృహీతా శ్రవణానందశృంఖల అసలు నేను రాయనేలేదని ఆయన వాదం.

వేంకటరామకృష్ణకవులే రాసి నా పేరు పెట్టారని ఆయన ప్రచారం.

చాలాకాలం యిలాగే చెప్పేవారు(ట) ఆయన.

అమలాపురంలో వారి శిష్యులొకరు ప్రయివేటు మెడికల్ ప్రాక్టీషనరు.

పేరు జ్ఞాపకం లేదు - ఇంటిపేరు బులుసువారు.

రాజా శ్రీ వాడ్రేవు విశ్వసుందరరావు బహద్దరువారి కుమారులు శ్రీధరరావు బహద్దరువారి వివాహానికి వెళ్లినప్పుడు వారి యింటోనే బస చెయ్యడం తటస్థించింది నాకు.

మా నాయనగారూ మా చిన్నన్నగారూ కూడా స్వయంపాక నియమం గలవారు కావడంవల్ల ఆడపెళ్ళివారు మాకోసం ప్రత్యేకంగా వొక బస యేర్పాటు చేశారు.

కాని అది దూరాన పడిపోయింది.

దానివల్ల వచ్చే యిబ్బందులు గుర్తించి నేను మరో బస చూడ్డానికి బయలుదేరాను.

ఒక రిద్దరు వీలులే దన్న తరవాత “సరే, రావచ్చు" నన్నవారు, ఆ డాక్టరుగారు.

నా పేరు చెప్పుకుంటూ బస అడిగా న్నేను.

"పరోక్షంగా మిమ్మ ల్నెరుగుదు" నంటూనే బస యిచ్చారు వారు.

అప్పుడే అన్నారు వారు "రామకృష్ణకవులే రాసి మీ పేరు పెట్టారనే వేంకటశాస్త్రిగారి నమ్మకం మొన్నటిదాకా; కాని తక్కిన మీ రచనలు - ముఖ్యంగా వీరపూజ చూశాక అది మీరే రాసివుంటారని నిశ్చయించుకున్నారు వారు” అని.

నా పుస్తకాల విషయమై వారెంతో, వారి పుస్తకాల విషయమై నేనూ అంతే, స్వతంత్రులం మేము, ఏమనుకోడాని కయినా.

కాగా, - వేంకటశాస్త్రిగారి ఆ నిశ్చయంతో నాకు తరిగేది లేదు, ఈ నిశ్చయంతో వొరిగేదీ లేదు.

పోతే, శృంఖలారచన నా కెంతో మేలుచేసింది.

369

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి