"దీంతో, మీరున్నూ యీ అగ్గిలో వురికినట్టయింది. మా ప్రేరణ లేకపోడం వొకటే యిందులో వున్న విశేషం. అయినా, మీరు చేసివుండవలసింది కాదు; కాని కీడొక్కటే కాదులెండి మేలూ వుంది దీనివల్ల కావలసినంత” అని కూడా అన్నారు వారు.
"మీ రచనలో కొన్ని పొరపాట్లున్నాయి మరి” అనీ అన్నారు, నిర్మొగమాటంగా.
కాకపోయినా, నా విమర్శ ఖండిస్తారు వేంకటశాస్త్రిగారు, తప్పనిసరిగా.
ఏది యేమయినా యిది నేదునూరి శంకరంగారికిన్నీ కళ్ళ బడాలి.
ఒక ప్రతి అకొండి కామరాజుగారి కివ్వడమే అందు కుపాయం.
సరిగా గురువులు శృంఖల పరిశీలిస్తున్నప్పుడే కామరాజు గారు వచ్చారు, పిలిచినట్టుగా.
"శంకరంగారి కిది ప్రతిక్రియ" అనిన్నీ అన్నారు, నే ననుకున్నట్టే.
వెంటనే వారికో ప్రతి యిచ్చా న్నేను.
"ఈ వివాద సందర్భంగా అనేకాలు తామే రాసి వేంకట శాస్త్రిగారు తమ శిష్యుల పేరు పెట్టడం మనకందరికీ తెలుసు. అలాకాక - మీ పక్షంగా - మీకు తెలియకుండా మీ శిష్యుడీ గ్రంథం రచించడమూ ప్రకటించడమూ మీ పక్షానికి మిక్కిలీ మంచిది" అన్నారు కామరాజుగారు, ప్రసంగవశాన.
"నా మాట ప్రమాణం కాదు, నాకూ తెలుసు. వేంకటశాస్త్రిగారి రచనల విషయమై మల్లయ్య (పురాణపండా) శాస్త్రిగారున్నూ పెదవి విరిచారు, మా నాయనగారి దగ్గిర. అనేకులు ప్రామాణికుల భావమూ అలాంటిదే వింటున్నాముగా? అయినా, మీకూ మాకూ అసలు, కలహం రావడమే చాలా అనుచితం; కాని ప్రారంభం అయిపోయింది, అనుకోకుండా. పెరిగీపోయింది హద్దులేకుండా, ఇక అటూ యిటూ కూడా మూలపురుషులతోనే యిది పరిమితం అయివుండాలంటే సాగదు. ఉభయత్రా శిష్యులూ అభిమానులూ కూడా యిందులో వురకడం అనివార్యం. కనక, సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చేసింది నేను తప్పనను. అయితే, దీనివల్ల ఆయనకూ కొన్ని దెబ్బలు తగుల్తాయి, తప్పదు; కాని సాహిత్య వ్యవసాయి కదీ వొక సాధనోపాయమేగా?" అనికూడా అన్నారు వారు.
“అది వొక్కటే యిందులో వున్న విశేషం” అన్నారు చివరికి, వేంకటరామశాస్త్రిగారు.
ఒకవిధంగా నిరుత్సాహంగానూ, మరోవిధంగా ప్రోత్సాహంగానూ యింటికి వచ్చేశా న్నేను.
పుస్తకం చూసీ పిఠాపురంలో జరిగింది విని చాలా సంతోషించాడు సుబ్బారాయడు.
పెద్దబ్బాయిగారూ చదివారు శృంఖల; కాని “తుషాహననం చేశారు మీ" రన్నారు, నిష్ఠురంగా.
చాలా పత్రికలకు పంపాను పుస్తకం.
కొన్ని అటూ, కొన్ని యిటూ రాశాయి.
పండితులున్నూ తెగిడినవారు తెగిడారు, పొగిడినవారు పొగిడారు.
ఆంధ్రభారతి అంటూ వొక మాసపత్రిక వచ్చే దారోజుల్లో.
ముట్నూరి కృష్ణారావుగారే ప్రకటించేవా రది బందరులో.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
368