Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ కొడుకుల కొడుకులూ మనమలూనూ ఇప్పటివారు.

వారిని చూసి అదే నాగరకత అనుకుని గుడ్డిగా దానికి దాసులయినవారున్నూ యిప్పటివారు.

సంప్రదాయం విచ్ఛిన్న మయిపోయింది, వీరు బయలుదేరాటప్పటికి.

మన విద్యలూ, మన ధర్మాలూ అజ్ఞానవిలసితాలయి పోయాయి వీరికి.

పోనీ అంటే, ఆ యింగ్లీషు విద్యలంటాయే గాని ఆ సంస్కారం అబ్బ లేదు, నికరమైనది వీరికి.

ఆ యింగ్లీషు సంప్రదాయమున్నూ అంటలేదు, జాతీయమైనది.

అంట లేదంటే అసాధ్యం అయికాదు, ఎబ్బెట్టయి.

ఆ యింగ్లీషు చదువులను తా మనుకరింపగలిగారే గాని, తమ స్త్రీలను ఆ యింగ్లీషుస్త్రీల ననుకరింపచెయ్యలేకపోయారు వీరు మరి.

మాట్టాడితే అరిస్టాటిలూ, సోక్రటీసూ, డార్వినూ - ఇత్యాదులు స్పురిస్తారు వీరికి.

పోనీ, వారి మాటమీద నడుస్తారా?

అది చేతకాదు మళ్ళీ.

ఏమంటే?

మన దర్శనాలంటే అసంతృప్తి, క్రిష్టియన్ దర్శనం అంటే అపనమ్మకమూనూ వీరికి.

"ఇతో భ్రష్ట స్తతో భ్రష్ట.”

ఇది పనికిరాదు - అది పనిచెయ్యదు.

జ్ఞానం - సంస్కారం - దృక్పథం - సాధన - ప్రాప్యం అన్నీ తమతోనే ప్రారంభం వీరికి.

పోనీ అంటే, అవి శుద్ధసంకీర్ణాలు.

ఆటవికులకున్నూ నికృష్ట మైనదో మహోజ్జ్వల మైనదో వొక గతచరిత్ర వుంది, వీరి కాపేరింటిదే లేదు, లేశమూ.

దయనీయమైన స్థితి వీరిది.

వింతెందుకూ?

ఇంగ్లీషువారు మన యూనివర్సిటీల్లో, తమచేతికింద గుమాస్తాగిరీ నిర్వహించ గలవారు తయారుకావడానికి చాలిన విద్యాప్రమాణం మాత్రమే ప్రవేశపెట్టగా, అదే సర్వమూ అనుకున్న వీరి భవితవ్యం మరో విధంగా యెందుకుంటుందీ?

వెనకటి మన "యింగ్లీషు” వా రిలాంటి త్రిశంకువులు కారు.

కనకనే మన విద్యలంటే వారి కలాంటి ప్రమాణబుద్ధి.

మన విద్వాంసు లంటేనూ అలాంటి ఆదరగౌరవాలు.

అంచేతనే పెద్ద దక్షిణమూర్తి శాస్త్రిగారియెడల అంత విధేయులు వారు.

అ కారణంవల్లనే వారలా స్థిరపరుచుకున్నారు.

ఇంతలో జడ్జీ వచ్చాడు.

వా రందరూ లేచినుంచున్నారు.

363

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి