ఆ నిశ్చయం గుప్తంగానే వుండిపోవలసివచ్చిం దీకారణంవల్ల.
బలపడిపోయిం దాగుప్తస్థితి వల్ల.
నిద్రాహారాలు వెగటయిపోయాయి క్రమంగా.
ఇల్లు ఎప్పు డెలా విడిచి పెట్టాలో, ఏదారి నేవూరిమీదుగా ప్రయాణం సాగించాలో, ఎక్క డెక్కడ మకాములు వెయ్యాలో, ఎన్నాళ్ళకి బూరాడపేట చేరుకోడమో, అక్కడ యెలా ప్రవేశించడమో - ఈ ప్లానంతా తయారయిపోయింది, నిశ్చితంగా.
ఒకనాడు మా పెత్తండ్రిగారితో చెప్పారు మా నాయనగా రిదంతా.
స్వయంగా తోచలేదుగాని, మా పెత్తండ్రిగారికీ వుందీతపన.
దీనికి సాయం అటూ యిటూ కూడా మా నాయనగారి మార్గదర్శకత్వం.
"సరే" అనేశారు వారున్నూ.
అంతే.
"ఏమయిపోయారు మనవాళ్ళు?" అంటూ మా తాతగారిక్కడ బెంగటిల్లిపోయారు; కాని వారంరోజులు తిరిగేటప్పటికి పెద్దదక్షిణామూర్తి శాస్త్రిగారి దగ్గిరనుంచి వుత్తరం "మామా, కంగారుపడకండి, మీ కుమా ళ్ళిక్కడ క్షేమంగా వున్నారు. పంచాంగ రచనలో స్వతంత్రులయి వచ్చి మిమ్ము సేవించుకుంటారు త్వరలోనే" అని,
మొత్తం రెండు సంవత్సరాలుండినారు మా నాయనగా రక్కడ.
స్వతంత్రులూ అయినారు.
ఇక మా పెత్తండ్రిగారా?
గ్రంథాలు వల్లించారు.
గణితాలు చేశారు.
కాని, డిటో ప్రకారమే.
ఒక్కక్షర మైనా చెప్పనక్కరలే దెవరూ, కూడా మాత్రం తీసుకువెళ్లాలి బల్లదగ్గర వుండి - అంతే.
55
మా నాయనగారూ, మా పెదనాయనగారూ యిదిగో, యిందుకోసం అక్కడ వుండినప్పుడు, అగ్రహారానికీ సంస్థానానికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
అగ్రహారం యిచ్చారే గాని సిద్ధాంతులను సరిగా ఆదరించలేకపోయారు, సంస్థానాధీశుల్లో తరవాత్తరంవారు.
వైమనస్యాలు బలిసిపోయాయి.
నిర్లక్ష్యభావాలున్నూ ముదిరాయి, అటూ ఇటూ.
వెనకటివారు అంతటితో నిలిచిపోగా, అప్పటిరాజు అగ్రహారంమీద పన్ను విధించాడు, మరో అడుగు ముందుకివెళ్ళి.
సిద్దాంతు లందు కంగీకరించలేదు.
“ఇది సర్వాగ్రహారం. పన్ను కట్టడానికి మీ కధికారం లే" దంటూ గట్టిగా ప్రతిఘటించారు వారు.
361
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి