పద్యంలోనుంచయినా వచనంలోనుంచయినా భావమున్నూ అలాగే ద్యోతకం అవుతూ వుండాలి, నిరవధికంగా
విచారణకున్నూ ఆగాలి అది.
అదీ కవిత్వానికి యోగ్యత.
ఆలోచనామృతం గాని సంగీతంలాగ ఆపాతమధురం కాదు కవిత్వం, మరి.
ఆ ఆలోచనకున్నూ అధికార తారతమ్యం వుంది, మళ్ళీ.
ఈతపండు సులభంగా నోట వేసుకోవచ్చు, పనసతొన సాధించుకోడమే శ్రమ, పండు చేతిలో పెట్టినా.
శ్రమ అంటే కవిత్వం సందర్భంలో కాయికం కాదు, మనోధర్మం.
ఆస్వాదన చతురతకు సంబంధించిన విచారణ వచ్చినప్పుడు, పనసతొనతినేవాడికా ఆదరగౌరవాలు, ఈతపండు తినేవాడికా?
ఇవి రసికుల విశ్వాసా లప్పుడు.
ఇవాళ “రసికు”డంటే తిట్టు అని భావన.
"సరసు"డన్నా వొణికిపోతారు కొంద రిప్పుడు.
మన జాతికిప్పుడు గాఢానుభవాని క్కావలసిన జవసత్వాలు లేకపోడమే యిందు క్కారణం.
తెలుసుకోగలిగితే, సరసతా రసికతా కూడా విశిష్టమైన నాగరకతకు చిహ్నాలు.
అవి సభాపూజ్యాలున్నూ.
మనిషి కవి వుండడమే సభలో ప్రవేశించడాని కర్హత, డబ్బుండడమూ అధికారం వుండడమూ రాజకీయాల్లో తిరుగుతూ వుండడమూ కావు.
ఏమంటే?
అవిన్నీ మనోధర్మాలే.
కళాప్రీతి కాదు వాటిక్కొలబద్ద, కళాపరిజ్ఞానం.
శాకుంతల నాటకం చదివి, గేథే అనే జర్మను సాహిత్యవేత్తకూడా ఆనందతాండవం చేశాట్ట, మరి, ఆ శాకుంతలం రచించిన కాళిదాసే కుమారసంభవంలో అష్టమసర్గా రచించాడు, అతని రసికత నింద్యమేనా?
చెప్పవచ్చిందేమిటంటే?
ఇప్పటి మనవారి చదువు వేరు.
అది లేశమూ జాతీయం కాదు.
రసానుభవపద్దతి వేరు.
అది యేకొంచెమూ భారతీయం కాదు.
జీవనసరణి వేరు.
దాని క్కావలసినంత మనోదార్డ్యం లేదు.
దృక్పథమున్నూ వేరు.
దానికి స్ఫుటమైన ప్రాప్యమే లేదు.
ఎటూ కాని తరం యిది.
పోనీ అంటే యేసంస్కారమూ అస్థిగతం కాని తరం యిది.
351
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి