Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా పుస్తకం పుచ్చుకున్నేను కూచున్నాను.

తనకి తోచిన అసందర్భాలు కనపరుస్తూ అతనే చదవసాగాడు, నన్ను చూస్తూ వుండ మని.

పదిపదిహేను పద్యాలయినాయి ఆ పూట.

మధ్యాహ్నం మళ్లీ కూచున్నాం.

“ఒక్క పద్యంలోనూ చిక్కదనం కనపడ దేమిటండీ?" అనడిగా డతను చదివి చదివి.

"పద్యం తరవాత పద్యం చరచరా నడిచిపోతోంది; కాని కాస్త సాహిత్యపరిచయం వున్నవాడికి, ఇందులో, వొక్కమాటు నిలబెట్టే రచనాప్రౌఢీ లేదు, వొక్కమాటు ఆహా అనిపించే భావమూ లేదు.”

“కులాసాగా చదువుకోడానికి బాగుందా పోనీ?"

"పాడుకోడానికి కొన్ని పద్యాలు బాగున్నాయి, అక్కడక్కడ కుంటుతూ వుండినా."

“మరి చాలామంది మెచ్చుకుంటారే యిది?"

"నేనూ ఆ భ్రాంతితోనే కొన్నాను; కాని నిరాశ చేసుకోవలసి వచ్చింది." 'మనమా వద్దికి నాదుమాట వినుమా, మర్యాదగా పాడుమా' అన్న మకుటంతో కొన్ని పద్యాలున్నూ యిందులో, కాని 'నాదు మాట యేమిటండీ?' ఏవో శబ్దాలు ఏదో విధంగా బిగించగానే సరాయిసకపూడి వడ్రంలాగ, అతకవద్దూ? పైగా పిష్టపేషణం తప్ప యేంవుందీ అందులో?" అన్నా డతను.

వెంటనే దొడ్డంపేట వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది నాకు.

"పెద్దబ్బాయిగారికి వినిపించా నిది. చప్పరించేశారు వారు" అనిన్నీ చెప్పా డతను.

ధర్మమే.

మనుచరిత్రవొక్క టే కాదు, వసుచరిత్రా, ఆముక్తమాల్యదా, రాఘవపాండవీయమూ జిహ్వాగ్రాన వున్నవారు పెద్దబ్బాయిగారు.

ఎందరికో పాఠమున్నూ చెప్పివున్నా రవి.

పద్యం చూస్తే "ఏముందీ దీల్లో విశేషం?" అని పరిశీలించడం వారి పద్ధతి.

నారికేళపాకం అయితేనే ప్రీతికాదు వారికి, విజయవిలాసంలో నున్నూ యేమిటేమిటో విశేషాలు చెప్పేవా రాయన, అంత సులభమైన పద్యాల్లో కూడా విరుపులు విరుస్తూనూ, విశ్లేషించి వివరిస్తూనూ.

అప్పటి రసికు లందరిదీ అదే తీరు.

బంధకవి భుజంగరాయడుగారని వొక సంపన్న నియోగి గృహస్థు.

మాకు మూడుమైళ్ళలో వున్న లొల్ల గ్రామానికి కారణం ఆయన.

తటవర్తి వేంకటరాజుగారి వియ్యంకులున్నూ.

ప్రతిపదార్థం నడిచేది కాదాయనకు, భారత భాగవత రామాయణాలు మాత్రం పురాణం చెప్పేవారు మళ్ళీ, పండితులున్నూ వోహో అనేటట్టు.

349

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి