అది యజ్ఞం కూడా చేసుకున్నాక సంభవించింది; మిక్కిలీ ధన్యురాలే ఆమె, మేమే దురదృష్టవంతులం.
పుట్టింట మహారాజు కూతురన్నట్టు సుఖపడ్డా రామె.
అత్తింటా లోటువడి యెరగ రెప్పుడూ.
మా నాయనగారు దోసిళ్ళకొద్దీ డబ్బు సంపాదించి తెచ్చేవారు, నిశ్చింతగానూ నిపుణంగానూ మా అమ్మగారు సంసారం నిర్వహించేవారు.
అయితే, మునికొడవలి గ్రామంలో వుండినంతకాలమూ మా అమ్మగారు మా నాయనగారూ కూడా సంవత్సరాని కొక్కమాసం రోజులు చాలా బాధపడేవారు.
దాని క్కారణం గోదావరి వరదలు.
మునికొడవలి గోదావరి పాయకీ పోతగట్టుకీ మధ్యగా వుంది.
అంచేత, వరదలకాలంలో యేటా అది మునిగిపోతూ వుండేది.
ఆ వరదలు, పూర్వవరదా వుత్తరవరదా అని పది పదిహేను దినాల్లో రెండుమాట్లు వూరు ముంచేసేవి.
ఆ పది పదిహేనుదినాలూ బంధువులు యిళ్ళకు పొరుగూళ్ళు వెళ్ళినవారు వెళ్ళిపోగా, వుండిపోయినవారందరూ వానకి తడుస్తూనూ యెండ కెండుతూనూ పోతగట్టుమీదే కాపరం.
ఒకవైపున మూడుమైళ్ళ వెడల్పున కూలంకషమైన అఖండ గోదావరీ ప్రవాహం.
మరోవైపున నాలుగైదు నిలువుల లోతున పోతగట్టు పొడుగునా కొండలోయలాగ పల్లం.
ఇటు కాలుజారితే సాగరమే గతి.
అటు కాలుజారితే పచ్చడి అయిపోడమే పర్యవసానం.
ఇలాంటి పరిసరాల్లో, పది పన్నెండు అడుగుల వెడల్పు మాత్రమే వుండిన పోతగట్టున మకాము.
ఆ మకాములు తొక్కుకుంటూ, రాజమహేంద్రవరం మొదలు ఏనుగుతలకాయ కొండదాకా ఎడతెగని బాటసారులు.
ఎవరయినా సులభంగా గ్రహించవచ్చు, ఆ స్థితి.
అదిగో అది భరించలేకా, పొలమూరిలో వుండుకున్న ఈనాంభూమి తాలూకు శిస్తు తెచ్చుకోడానికి వెళ్ళినప్పుడల్లా ఆ వూరి మున్సబు తటవర్తి భీమరాజుగారు (సంపన్న నియోగి గృహస్తు) నిర్బంధించడంవల్లా మా నాయనగారు పొలమూరిలో ప్రవేశించారు.
తరవాత వొక సంవత్సరానికి పొలమూరిలోనే నా పుట్టుక.
తటవర్తి భీమరాజుగారూ, రామవరపు గ్రామకరణం బుద్ధవరపు లక్ష్మీనరసింహం గారూ, మహేంద్రవాడ పెద్దకాపు కర్రి సుబ్బారాయడూ (భూమంచిరెడ్లు) మాకు పెట్టనికోటలయి వుండేవా రక్కడ.
నా బాల్యం అంతా ఆ గ్రామంలోనే గడిచింది.
పాతికేళ్ళ వయస్సు వచ్చేవరకూ అక్కడే వున్నా న్నేను.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
13