నిజాని కంత జుట్టున్నందుకు ముడివేసుకుంటే బాగానే వుండేది; కాని దువ్వుకోడం దగ్గిరికి వచ్చేటప్పటికి విసుగు.
తలంటుకోడం ఆలస్యం అయితే పేలు బయలుదేరేవి కులకుల్లాడుతూ, అదొక పీడ.
స్నానం చేస్తే, ఆరేదాకా నెమిలిపింఛంలాగ విప్పుకుని వేళ్ళతో చిక్కు తీసుకోవాలి, అదో బాధ.
వేసవి వస్తే జుట్టంతా చెమటతో తడిసి ముద్దయిపోడమే కాదు, సూదులతో పొడుస్తున్నట్టు తల అంతా చిటచిట్టాడం - నిజంగా అది యమబాధే.
అయితే, జుట్టే వుంచుకోవాలనుకునేవారి కివి స్వల్పాలే; కావి క్రాపింగు వ్యామోహం నాకివి అసహ్యా లనిపించింది.
కాక, - కాలం పరుగెత్తుతుంది, స్థిరంగా వుండదు.
దాంతో, కొత్తరుచులు కలుగుతాయి, కొత్త వూహలూ పుడతాయి, ప్రయత్నం అక్కరలేదు.
ప్రభుత్వమే మారిపోయింది మనకి, తప్పనిసరి మార్పులు ముంచుకుని వచ్చాయి, పెద్ద యెత్తునా వచ్చాయి.
దీనికి సాయం - మారినవాళ్ల కెందునా అభ్యంతరాలు లేకపోతున్నాయి, చేతకాని నిందలు తప్ప.
ఇక పూర్వాచారపరాయణు లయినవా రేమంటే యేమి నిలిచిపోతుందీ?
అయితే, షట్కర్మపరాయణమైన వంశాన పుట్టివుండడం వల్లా, ఎంతో కొంత వైదికవిద్యలే నేర్చుకుని వుండడంవల్లా చిన్నప్పణ్ణుంచీ అలవాటయి పూర్వాచార పరాయణత్వమే పాటించేవాణ్ణి నే నెక్కువగా.
అప్పటి నా దృక్పథం అవగాహన కావడాని కొక చిన్న వుదంతం.
ద్వారకాతిరుపతి వెళ్లాం మే మొకమాటు.
కొండమీద మా మేనల్లుడికి వొడుగు.
తొలినాటి సాయంత్రాని కావూరు చేరుకున్నాం.
సత్రంలో బస.
పిల్లా మేకా యాభయిమందికి మించివున్నాం.
తెల్లవారితే ముహూర్తం.
రాత్రివంట లయినాయి.
మా నాయనగారూ, మా పింతల్లులు భర్తలూ పురోహితుడూ మొదలైన శిష్టులు స్నానాలు చేద్దామనుకుంటూ వుండగా పరివారంతో వచ్చి వొక నాయడుగారు బసచేశా రాసత్రంలోనే.
వారి వంటవాడు పొయిలో నిప్పున్నూ వేశాడు.
అది చూడగా ముందు నాకు పట్టుకుంది కంగారు, వంటలు మైలపడిపోయాయని.
పెద్దలు మాట్టాడారు; కాని "సబ్ కలెక్టరుదొరగా రండీ, పొమ్మనడానికి వీలా?" అన్నాడు గుమాస్తా.
335
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి