Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాస్త మంచిభోజనం కావాలనుకునేవా రందరూ అక్కడే భోజనం చేసేవారు, వెతుక్కుంటూ వెళ్ళి.

నేను చూశాటప్పటికే వరదాచారి వయస్సు యాభై పైని; కాని రంగడికుచ్చులా వుండేవాడు, బెండకాయ ముద్రలతో అతను.

అతని విలాసాలు వర్ణించేవా రెందరో వున్నా రిప్పటికీ రాజమహేంద్రవరంలో.

అతని హోటలుకే వెళ్ళాను మొదటిమాటు నేను, వాకబు చేసుకుని.

"ఏం, తెనుగు హోటళ్లు లేవా?" అంటే లేకేం?

వొక్కటీ కూడా అడుగు పెట్టడానికి వీలుండదు, అంతే.

అయినాసరే అని వెడితే, సరిగా మాటే ఆడడు యజమాని.

రావలసినవాళ్లని ఆకర్షించలేకపోడమే గాదు, వచ్చినవాళ్ళ నయినా ఆదరించలేడు తెనుగు యజమాని.

సాధారణంగా యజమాని కనపడనే కనపడడు తెనుగు హోటల్లో.

ఇప్పటికీ యిదే పద్ధతి మనవాళ్లది.

లేకపోతే, తెనుగుదేశం అంతా అరవ కన్నడహోటళ్లతో నిండిపోవలసిన కర్మం యేమీ?

ఎవరెంత నీచంగా చూసినా, హోటల్ వృత్తి యివాళ పెద్దవృత్తుల్లో వొకటి.

జాతి మనుగడకు అత్యవసర మయిం దది, సామాన్యం కాదు.

వ్యక్తికే ఐచ్ఛికం గాని జాతికి అత్యావశ్యకం అది.

కాని తెలుగువాడికి దాని విలవ తెలిసిరాలే దింకా.

ఏ నాయకుడూ ఆలోచించ డిది.

ఏ పత్రికా సూచనచెయ్య దీవిషయమై.

జాతికి అంగాలూ, తద్వికాసానికి ఆవశ్యకాలూ అనేకాలన్న సమ్యగ్బోధ లేకపోడమే యిందుక్కారణం.

ఇలాంటిదే తెనుగుదేశం కొల్లగొడుతున్న మరోటి హిందీ ఫిల్ముల దండయాత్ర.

తెనుగులో మాత్రం ఫిలిముల్లేవా అంటే, మరి ఉత్తరాది వాళ్లవి చూడరేం?

బట్టలకోసం ఖండాంతరాలకు ప్రవహించిన ధనప్రవాహంకంటే పెద్దదీ అపాయకరమూ కాదూ హిందీ ఫిలిములు కారణంగా ఉత్తరాదికి ప్రవహిస్తున్న ధనప్రవాహం?

ఖండాంతరాలు పత్తికొనడం రూపంగా అయినా కొంత డబ్బిచ్చేవారు మనకి, హిందీ ఫిలిములు దమ్మిడీ కూడా ఇవ్వడంలేదు.

ఈ విపత్తు గుర్తించిన నాయకుడూ కనపడ్డంలేదు మనలో.

కొన్నా ళ్ళింగ్లీషు ఫీలిములూ కొట్టుకుపోయాయి మన డబ్బు, ఇప్పటికీ కాస్తో కూస్తో కొట్టుకుపోతూనే వున్నాయి, నాకు బాగా తెలుసు.

అయితే, ఆ ఫిలిములు చూస్తే అపారమైన ప్రపంచ జ్ఞానమూ, ఫిలిముల నిర్దోషితకు కావలసిన పరిజ్ఞానమూ అయినా కలుగుతాయి బాగా.

హిందీ ఫిలిములు డబ్బు నొల్లుకుపోడమే కాదు, యువయువతుల జీవితాలున్నూ తప్పుదారికి మళ్లిస్తున్నాయి.

331

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి