Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంతిలో యెందరుంటే అందరి దగ్గిరా నేతిగిన్నెలుంచేవా రామె.

ప్రతీ గిన్నెలోనూ గరిటె కూడా వుండేది.

పప్పు, కూర, పచ్చడి, పులుసు - ఇన్నిటికీ సరిపోయే నెయ్యి అది.

ఓరకంట చూశాను, నాదగ్గిరా వుందొక గిన్నె; కాని స్వయంగా వడ్డించుకోడానికి ముక్కటపడిపోయాను.

అంచేత, పప్పు కలిపి వొట్టి అన్నమే తినసాగాను.

అది చూశారామె. "అయ్యో, నాయనా, వొట్టి అన్నం తింటున్నావా?" అంటూ వూచలా వచ్చి గిన్నే నా విస్తరిలో వంచేశారు.

పప్పూ అన్నంలో పులుసు కలుపుకున్నట్టయింది నాకు.

అప్పుడు చెప్పారు పంతులుగారు “ఇది మాయింటి పద్ధతి" అన్నీ "నెయ్యి అయిపోతే అడక్కుండానే మళ్ళీ వడ్డిస్తా”రనీ "మొగమాటపడవ”ద్దనీని.

దాంతో పుత్రవాత్సల్యం కలిగిపోయింది సీతమ్మగారికి నేనంటే.

“నాయనా" అనేగాని నన్నెప్పుడూ పేరుపెట్టి పిలిచి యెరగ రామె.

అప్పుడప్పుడు నాకు ఫలహారమున్నూ పెట్టేవారామె.

లక్ష్మీపతిగారి కంటించినప్పుడల్లా సాధారణంగా నాకూ తల అంటించేవారు.

నిజంగా, రాజర్షి రామయ్యపంతులుగారు, నాతో యెప్పుడు మాట్లాడినా విద్యాభ్యాసం విషయమే మాట్లాడేవారు.

ఎందుకు చెప్పానంటే?

వారాల భోజనం కష్టసుఖాలతో పెనవేసుకుని వుంటుం దిలాగ.

పాలపొంగు తగ్గించి, విద్యార్థిని మంచిదారికి మళ్ళిస్తుందది.

43

గురుకులవాసమూ వారాలభోజనమూ పిఠాపురంతోనే ఆఖరు నాకు.

అయితే, చదువెంత తృప్తికరంగా సాగిందో వారాల పద్దతి అంత తృప్తికరంగా సాగలేదు నాకక్కడ.

అది, అటు పల్లెటూరూ యిటు పట్నమూ కూడా కాకపోడమే అందుక్కారణం.

గొప్ప పండితులున్న పల్లెటూళ్ళలో, ఆ పండితుల ఘనతా, ఆ పండితులుండడంవల్ల తమ గ్రామాలకు వచ్చే ఘనతా గుర్తించుకుని, వారి శిష్యులకు తామే తల్లిదండ్రులయి సాదరంగా భోజనం పెడతా రావూళ్లవారు.

పట్నాల్లో అలాంటి భావాలుండవు సాధారణంగా.

ఇంతకీ, - పట్నాల్లో చలవమడతలు పట్టుకుని తిరిగేవా రందరూ సంపన్నులనీ - అధవా - లోటులేనివా రనీ అనుకోడానికి వీల్లేదు.

మదరాసువంటి నగరాల్లో యిది మరీ స్పష్టంగా తెలుస్తుంది.

నాగరక జీవితానికీ జానపద జీవితానికీ దృక్పథమే వేరు.

దాని కనుగుణమే యీ వ్యత్యయం.

పల్లెటూళ్లల్లో వొకరి సంగతి నౌకరికి తెలియం దుండదు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

324