దీనికి తోడు, పోతూపోతూ వుండిన బాల్య చాపలమూ, ముమ్మరంగానే వుండిన జిహ్వాచాపలమూను నాకు.
నిగ్రహించుకోలేకపోయా న్నేనవి.
వెంటనే "పరమాన్నం నాకు చాలా యిష్టమండీ” అనేశాను, ముసలమ్మతో.
అనేశాను, వెంటనే సిగ్గుపడిపోయాను.
చూడగా, కత్తివేస్తే నెత్తురుచుక్క లేకుండా స్తబ్ధులయిపోయి వున్నారు, భార్యాభర్త లిద్దరూ.
పుండుమీద కారం చల్లినట్టయింది నా మాటతో వారికి.
అలా అనడం ముసలమ్మ తప్పే, మరి యిలా అనడం ?
ఈ ఝడితిస్ఫురణతో చాలా బాధపడిపోయా న్నేను.
ఈ స్థితిలో, ఎప్పుడు తేరుకుందో, పదిగరిటెల పరమాన్నం నా విస్తరిలో గుమ్మరించి పొయ్యి దగ్గిరికి వెళ్లిపోయిందా అమ్మాయి.
అది చూసి రుసరుసలాడుకుంటూ చివాలున లేచి చక్కాపోయింది, ముసలమ్మ.
42
వారాల భోజనంలో నాకిలాంటి అవస్థలే కలుగుతూ వచ్చాయని కాదు చెప్పడం.
ఒక్కొక్క తల్లి యెంతో మమత కనపరిచేది.
విరియాల రామయ్య పంతులుగారని వేట్లపాలెంలో వొక సంపన్న గృహస్థు.
గోల్కొండ వ్యాపారులు వారు.
స్థితిపరు లాయన, మంచి భోగిన్నీ.
అప్పటికి షష్టిపూర్తి కటో యిటో వున్నా రాయన, భార్య చనిపోయింది పాపం.
ఇద్దరు కూతు ళ్లాయనకు, కొడుకు ల్లేరు.
పెద్దల్లుడు లక్ష్మీపతిగా రిల్లరికం వుండేవారు.
వంటా వడ్డనా, యింటి యాజమాన్యమూ పంతులుగారి చెల్లెలు సీతమ్మగారు నిర్వహించేవారు.
ఆమె జ్ఞాపకంవస్తే నాకు భక్త్యావేశం కలుగుతుందిప్పటికీ.
శుచీ శుభ్రమూ ఆమె సొమ్ములు.
దయా దాక్షిణ్యమూ ఆమె ఆభరణాలు.
పంతులుగారిని నేను వారం అడగ్గా రమ్మన్నవా రామే.
మొదటిపూట భోజనాని క్కూచున్నాం.
వడ్డన పూర్తి కాగా పరిషేచన చేశాం.
వంటింటి గుమ్మాన నుంచుని వుండిపోయా రామె.
"నెయ్యి పట్టుకురారేం?” అనుకున్నా న్నేను.
చూడగా, మామా అల్లుడూ స్వయంగా వడ్డించుకుంటున్నారు నెయ్యి.
చిత్రం యేమిటంటే?
323
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి