Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన్నెండు కొడితే పోస్టాఫీసు తెరుస్తారు, వొంటిగంట లోపున పోస్టు చెయ్యాలి.

కాని, అక్షరాలో యెనిమిది రూపాయలు కావాలి, మరి.

చేసేది లేక డస్కు బల్ల దగ్గిర చతికిలబడ్డాను.

అయితే, రాద్దామంటే కలమూ నడవదు, చదువుదామంటే బంతీ గడవదు, మనస్సు మనస్సులో లేక.

ఉసూరు మనిపోయింది ప్రాణం.

డబ్బు విలవ మళ్లీ తెలిసివచ్చింది, కొట్టవచ్చినట్టు.

కాని, యేమిటీ చెయ్యడం ఆ క్షణాన?

మార్గా లాలోచించాను.

బల్లమీదికి మోచేతు లానుకుని, కళ్లున్నూ బాగా గుచ్చేసుకుని మరీ తీవ్రంగా ఆలోచించాను, మళ్లీ.

ఉండగా వుండగా బల్లమీద యేదో చప్పుడయింది.

చూడగా ఎదట పోస్టుమేనూ, బల్లమీద పత్రికలూ ఉత్తరాలూ దొంతిన్నీ.

తియ్యగా అందులో వొక మణియార్డరు.

చదవగా "ఎనిమిది రూపాయలు మాత్రమే" అని వుంది, అక్షరాలా అంకెలా కూడాను.

సంతకం చేశాను, తెలిసికాదు.

రూపాయలు పుచ్చుకున్నాను, లెక్క చూసి కాదు.

బండి పిలిచాను, పోస్టాఫీసుకు వెళ్ళాను, బిళ్లలు కొన్నాను, అంటించాను, పోస్టుమాస్టరు కప్పగించిన్నీ వేశాను, పాకెట్లు.

నెత్తిమీది కొండ దింపుకున్నంత తేలిగ్గా వచ్చా నింటికి.

ఇప్పుడు విప్పా నుత్తరాలు.

"తెనుగు పత్రికల్లో ప్రబుద్ధాంధ్ర వొకటే నాకు నచ్చింది; కాని వొక్కరూపాయి చందాతో మీరెలా నడుపుతున్నారో నా కర్థం కావడంలేదు. ఏమయినా విరాళం పంపుదామంటే, నావల్ల కాదు, శుద్ధబీదవాణ్ణి నేను. అంచేత, పత్రిక ఆగిపోతుందేమో అన్న భయంతో ప్రయత్నించి యేడుగురు చందాదారులను చేర్చి నా చందా కూడా కలిపి, కమీషను నేనే భరించి అది మీ కివాళ మనియార్డరు చేశాను. సంవత్సరం పొడుగునా మాకు పత్రిక పంపం" డని వొక జాబు.

అందుతోబాటు వొక జాపితా.

తెనాలినుంచి వచ్చిం దది.

ఇది యేమనుకోవాలీ?

లోకంలో యేదీ ఆగదు, గడిచిపోతూనే వుంటుంది.

అంచేత, ప్రతీ మనిషి జీవితంలోనూ సంభవిస్తూనే వుంటాయి, విచారణ కందని వెన్నో.

దొరక్క దొరక్క నాకు పిఠాపురంలో యేడోవారం దొరకడమున్నూ యిలాంటిదే, అచ్చంగా.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

320