తిరుపతివేంకట కవులు మహానుభావులుట.
రామకృష్ణకవుల లెక్కేమిటిట.
ఆ పద్యా లుపసంహరించుకోడమే కాదుట, రామకృష్ణ కవులను విడిచిపెట్టేసి, వెళ్ళి వేంకటశాస్త్రిగారి నాశ్రయించాలిట నేను.
"ఏమిటి మీరు చెప్పే" దనడిగా న్నేను, భోజనం ఆపుచేసి.
ముల్లీ చెప్పా రాయన, మరికాస్త విస్తరించి.
నాకు చాలా కోపం వచ్చింది.
అనిష్టుల విషయమై భోజనాని క్కూచోపెట్టి బ్రాహ్మణ స్త్రీలు మాత్రమే చేసే పద్ధతి యిది.
నన్నుద్ధరిద్దామనే అనుకున్నారు; గాని శంకరంగారీ అనుపపత్తి చూసుకోలేదు.
"పిలిచి భోజనం పెట్టినవార"న్న ఆదరభావం విడిచిపెట్టేశా న్నేనున్నూ.
"తిరుపతి వేంకటకవులు మహానుభావులో రామకృష్ణకవులు మహానుభావులో, వారూ వారూ కూడా మహానుభావులేనో - వారూ వారూ వున్నారు, చదువుకున్న సరసులూ వున్నారు, మీరు దిగవద్దా ప్రసక్తిలో" అన్నాను, వెంటనే నేను.
"మీకు తిరుపతి వేంకట కవులమీద భక్తి వుంటే కావలసినంతా - మీకు చేతనైనంతా కూడా చూపించుకోండి, వారి యెడల. రామకృష్ణ కవులమీద యిష్టం లేకపోతే అదీ చూపించుకోండి, చేతనయినంతా; కాని నా విషయమై మీరేమీ కలగజేసుకోవద్దు" అని దృఢంగా చెప్పాను.
మాటమీద మాట పెరిగింది.
దురుసుమాటలు ప్రారంభం అయినాయి.
“ఆ, ఆ, ఏమి చేస్తున్నావు శంకరం? పిలిచి భోజనానిక్కూచోపెట్టా తగువులాడ్డం ?” అంటూనే వున్నారు వృద్ధులు.
శంకరంగారు వినిపించుకోలేదు.
నేనూ వెనక్కి తగ్గలేదు.
“నువ్వెంత” అంటే “నువ్వెంత దాకా వెళ్ళిపోయింది.
"నే నా పద్యాలు నుపసంహరించుకోను సరిగదా, మీ యీ లౌక్యానికి నిరసనగా, మీ తిరుపతివేంకట కవులమీదే రాస్తాను పద్యాలు, తెలుసా? ఇంతకీ, - ఇంత దుశ్చింతతో భోజనానికి రమ్మన్నారు మీరు, మీ యింటో నేను భోజనం చెయ్యడం చాలా పొరపాటు" అనేశాను.
అంటూనే ఉత్తరాపోశనం పట్టేసి చర్రున బయటికి చక్కా పోయాను.
కామరాజుగారూ, సోములు దొరగారి తండ్రిగారూ దొరగారి అరుగుమీద కూచునివున్నారు.
నా వాలకం చూసి “యేమయిందేమిటి?" అనడిగా రిద్దరూ, ఆత్రంగా.
అంతా విని చాలా నొచ్చుకున్నారు.
“తరవాయి మా యింటో భోజనం చెయ్యండి" అన్నారు కామరాజుగారు; కాని నే నంగీకరించలేదు.
317
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి