యింటికి భోజనానికి రండి" అని పిలిచారు నన్ను.
అదెందుకో నా కవగాహన కాలేదు గాని పెద్దమనిషి రమ్మంటే తిరస్కరించడం ధర్మం కాదు కనకా, నా కది వారం లేని రోజుకూడా కనకా, “సరే” అన్నా నిష్ణాపూర్తిగానే.
ఇది ప్రభాకరశాస్త్రిగారికి ప్రత్యుత్తరం రాసి కవితలో ప్రకటించిన మలీవారం జరిగింది.
ఆ పద్యాలు కామరాజుగారు చదివారు.
కామరాజుగారూ, రామకృష్ణకవులూ, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ దగ్గిరో దూరమో బంధువర్గానికి చెందినవారు.
కాగా, - కామరాజుగారు, తిరుపతివేంకటకవులనూ కాదనలేరు, రామకృష్ణకవులనూ కాదనలేరు.
అయితే, వొకవూళ్ళో కాపరాలు కనకా, తాము సాహిత్య ప్రియులు కనకా, తరుచు రామకృష్ణకవుల దగ్గిర కూచుని సాహిత్య చర్చలు వింటూ ఆనందించేవారు.
శంకరంగారు తిరుపతి వేంకటకవుల పక్షం.
రామకృష్ణ కవులంటే ద్వేషం కూడానుట.
ఈ సంగతి, తమ యింటోనే నేను మడికట్టుకుని వారి యింటికి భోజనానికి వెళ్ళేటప్పుడు పనికట్టుకుని కామరాజుగారే చెప్పారు, మరి యే మనుమానించారో?
దీనిమీద, శంకరం గారు ఆ వుభయుల ప్రస్తావనా చెయ్యక మానరనుకుంటూనే వెళ్ళా న్నేను.
అనుకున్నట్టే జరిగింది.
ప్రస్తావన చెయ్యడమే కాదు, చాలా అసభ్యంగా కూడా ప్రవర్తించారు శంకరంగారు, తీరా భోజనం ప్రారంభించాక.
సగం భోజనం అయేదాకా నాయెడల ఆయన కనబరిచిన దయ అంతా యింతాకాదు, ఇప్పటికీ కళ్ళక్కట్టినట్టుంది నాకు.
అది నే ననుకున్న ప్రస్తావనకు నాంది అని మొదటే నాకు స్పష్టం అయిపోయింది.
అది యెలా కొనసాగుతుందో మాత్రం వూహించలేకపోయాను, కాస్తా కూడా.
అదృష్టవశాన శంకరంగారి బంధువున్నూ నొక వృద్ధులున్నారు బంతిలో.
దొడ్డంపేట సంస్థానసిద్ధాంతు లయిన మా నాయనగా రంటే మిక్కిలీ ఆదరాభిమానాలున్నవా రాయన.
మా యింటిపేరూ నా పేరూ తెలుసుకుని, మా నాయనగారి పేరు జ్ఞాపకంరాగా "ఏమవుతారు మీ ”కనడిగి, సంగతంతా విని నేను కనపడ్డందుకు చాలా సంతోషమున్నూ కనపరిచా రాయన.
శంకరంగారున్నూ రాజా శ్రీ వాడ్రేవు రంగనాయకమ్మ జమీందారుగారిని చూసయినా నా విషయమై సభ్యంగానే ప్రవర్తించవలసినవారు.
కాని, కొంతసేపటికి వంటలక్క అలా చారు వడ్డించి వెళ్లింది, ఆయన యిలా పోరంటాలు మొదలు పెట్టారు.
ఆ పద్యాలు న న్నుపసంహరించుకో మని ఆ పోరంటా లయినా.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
316