కాని, అక్కడివారిలో చకితులై కొందరు నాకేసి వింతగా చూశారు, పకాలుమని నవ్వేశారు మరికొందరు.
మానేజరుగారు నిశ్చలంగానే వున్నారు మొదట, కాని కొంచెం చురుగ్గా చూశారు, తరవాత అటు.
ఆ నవ్వులూ ఆ చూపులూ వికటంగా కనపడ్డాయి నాకు.
"ఏం, నవ్వుతారేం” అనడిగా న్నేను, అసంతృప్తి కనపరుస్తూ.
అప్పుడు తటాలున లేచి నా దగ్గరికి వచ్చి మా యింటి పేరడిగారు మానేజరుగారు.
నేను చెప్పాను.
“అంటే, వైదికులా?" అని మళ్ళీ అడిగారు.
"అవు"నన్నా న్నేను.
వెంటనే నా చెయ్యిపట్టుకుని దయచెయ్యండంటూ లోపలికి తీసుకువెళ్ళి పక్కన కూచోబెట్టుకుని “ఇక్కడ వున్నవాళ్ళం మేమందరమూ నియోగులం. ఒకరిద్ద రితరులూ వున్నారనుకోండి, అయితే, అన్నదాతలచేత 'ఈపూట భోజనం చేసి వెళ్ళండి' అనిపించుకుంటాం మేము యుక్తిచేసి. ఆ యెత్తు సాగకపోతే, ఆ పూటకి పస్తుంటాం, గాంభీర్యం చెడకుండా. 'అన్నం పెట్టండి' అని మాత్రం యెవరినీ అడగం. ఇది మంచిదా చెడ్డదా అన్న విచారణ వద్దు. ఏమంటే? ఒక విధంగా మంచిదీ మరొక విధంగా చెడ్డదీని. అడిగించుకోడం మా పద్దతీ, అడగడం మీ సంప్రదాయమూను మరి. రెండూ సమర్థనీయాలే శాఖామర్యాదలనుబట్టి; కాని మీ విషయమై కొత్త సమస్య వచ్చింది మావాళ్ళకి. మీ వేషం లౌక్యంగానూ, మీ ప్రకృతి వైదీకంగానూ వుండడమే అందు క్కారణం. ఇప్పు డిక్కడ, మీ మాటమీద కొందరు చకితులయినా రన్నా, కొందరు నవ్వనే నవ్వా రన్నా మీ వేషమూ మీ ప్రవృత్తీ సమన్వయపరుచుకోలేకపోడమే కారణం. ఎవరికీ హేళన భావం లేదు, నమ్మండి. మీ కిక్కడ భోజనానికిన్నీ లోటులేదు, కూచోండి వేళ అవుతోంది" అన్నారు సాదరంగా
మావూళ్ళో నియోగులు - సంపన్న నియోగులే వున్నారు కనక, నాకు బాగా తెలుసు ఇది.
కొన్ని వైదికసంప్రదాయా లిప్పటికీ విడిచిపెట్టలేకుండానే వున్నాను; కాని అప్పటికే నా వేషం మారివుంది, నిజమే.
కాగా, మానేజరుగారు చెప్పినదాంతో తృప్తిపడ్డాను.
తరవాత, నేను నేర్చిన విద్యలసంగతి వచ్చింది.
ప్రశ్న చెప్పమన్నారు మానేజరుగా రవ్యధానంగా.
ఫలితం చెప్పా నాలోచించి నేను.
ఆ విద్యలో తమకూ ప్రవేశం వున్నట్టు తేల్చి, నేను ఆలోచించిన విధానం చెప్పమన్నారు వారు.
చెప్పాను.
కొంచెం చర్చ సాగింది.
313
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి