Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాటిపోయిందంటే దానికది కాదు, డెల్టాకుసంబంధించిన వుద్యోగి వొకాయన సకుటుంబంగా బయలుదేరి, నిర్ణీత సమయానికి గంటకి ముందే గెంటించుకుపోయాట్ట, తన బిళ్ళబంట్రోతుచేత కళాసులనూ, కళాసులచేత బోటున్నూ.

అక్కడికి పదిహేను మైళ్ళకి పైన వుంది ముక్కామల.

రహదారీ పడవమీద వెళ్ళవచ్చు; కాని రాత్రి తొమ్మిదింటి దాకా నిడదవోల్లో పడివుండాలి, వుసూరుమంటూ.

అయినా సరే అంటే, తెల్లవారుజాము నాలుగించిగ్గాని, ముక్కామల వెళ్ళలేము.

రోడ్డుంది గాని బస్సుల “ఐడియా”యే లే దప్పటికి.

టూరింగుకార్లే బహూ తక్కువ ఆరోజుల్లో.

అంచెజట్కాల పద్ధతిన్నీ యేర్పడలే దప్పటికి.

కాగా, నడిచివెళ్ళడమే గతి అయిం దావేళ.

అడ్డదారిని వెడితే పొలమూరినుంచి యెంత దూరం నడవాలో నిడదవోలినుంచిన్నీ అంతదూరమూ నడిచివెళ్ళవలసి వచ్చింది.

అయితే పది కావస్తోందప్పటికే, యెంత వురుకులూ పరుగులూ పెట్టినా మూడయినా అవుతుంది ముక్కామల వెళ్ళేటప్పటికి.

అప్పుడూ భోజనం.

ఇది బాగాలేదని వూళ్ళోకి బయలుదేరాను, బ్రాహ్మల యిళ్ళు వెతుక్కుంటూ.

ఒక బ్రాహ్మ డెదురై "ఇక్కడ కాదు. దారే కనక అట్లపాడు వెళ్ళండి, మీ కక్కడ యెవరయినా పెడతారు భోజనం" అన్నాడు.

కాలవ దాటితే, కాలవపక్కనే అట్లపా డక్కడికి మైలు.

రేవులో స్నానసంధ్యాద్యనుస్ఠానాలు నిర్వర్తించుకుంటున్న ఆ వూరి బ్రాహ్మలు "డి.పి.డబ్ల్యూ. మానేజరుగారి యింటికి వెడితే యెందరికయినా భోజనం పెడతా"రని చెప్పా రడగ్గా.

వెతుక్కుంటూ వెళ్ళాను.

మండువా హాల్లో పదిపదిహేనుగురు కూచుని వున్నారు, దర్జాగా కొందరూ, కొంచెం వొదిగివొదిగి కొందరూను.

వారిలో యెవరు ఎవరో తెలియదు, ఉద్యోగస్థు లన్నట్టు మాత్రం వున్నా రందరూ.

"మానేజరుగా రెవ" రని నే నడగడమూ, వొకాయన వారిని చూపించడమూ "యేమి పనిమీద వచ్చా" రని మానేజరుగారు నన్నడగడమూ వెంటవెంటనే జరిగిపోయాయి.

"నా కీపూట భోజనం కావాలి. ఎవరి కయినా మీరు పెడతారని విని వెతుక్కుంటూ వచ్చా” నని బదులు చెప్పాను, క్లుప్తంగా నేను.

మిక్కిలీ సూటి అయిన మాట యిది.

వైదికులయినవారి కిందులో అసందర్భం కనపడకపోడమే కాదు, మంచి సంప్రదాయమున్నూ కనపడుతుంది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

312