Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏమయినా, నేనా డబ్బు పుచ్చుకోకపోతే, నా విషయమై సుబ్బారాయడుగారి దగ్గిర అలాంటి ప్రయత్నం చేసిన గురువులు బాధ్యు లవుతారు మహారాజులుంగారి యెదట.

నేను బాగానే వుంటాను, చిక్కు గురువుల కవుతుంది.

ఇది నాకు శ్రేయస్కరమా?

పోనీ, ధర్మమా?

ఆ డబ్బు పుచ్చుకోడం అనివార్యం అయిపోయింది నాకు.

ఒక్క తృప్తిమాత్రం మిగిలింది.

"లోకం గతానుగతికం. వేత్తల మనుకునేవారున్నూ శుద్ధసత్యాలు వొప్పుకోలేరు, సాధారణంగా" అన్నారు, స్టేషనుదాకా వచ్చి రెయిలు కదులుతుందనగా రామకృష్ణశాస్త్రిగారు.

“చాలు” అనుకుని నిర్వికారంగా యింటికి వచ్చేశా న్నేను.

38

పిఠాపురం వెళ్ళేటప్పటికి హోటల్ భోజనం చెయ్యగూడదన్న నియమం విడిచిపెట్టేశా న్నేను.

అయితే, దినమ్మూ హోటల్లో భోజనం చేస్తే ఆరోగ్యం చెడుతుందన్న భయం అటూ, విద్యార్థి అయినవాడికి వారాల భోజనమే శ్రేయస్కరం అన్న నమ్మకం యిటూ బలంగా వుండడంవల్ల నే నక్కడ కూడా వారాలే చేసుకున్నాను, కొన్నాళ్లు.

కాని, వల్లూరిలోనూ, వేట్లపాలెంలోనూ, కానూరగ్రహారంలోనూ అడిగినంత చురుగ్గా యెవరినీ నే నక్కడ వారా లడగలేకపోయాను.

హోటలున్న వూరుగదా, గృహస్థులను మొగమాటపెట్టటమా అన్న సంశయం పీడిస్తూనే వుండింది నన్ను.

వేదశాస్త్రాలు చదువుకునే విద్యార్థుల్లో కాక, నేను లౌక్యవేషంతో వుండడం కూడా నా వెనకతీతకు కొంత కారణం అయింది, చెప్పకేం?

ఆ వేషం నాకో వింత అనుభవం కూడా కలిగించిం దొకనాడు.

ఆవేళ మా అత్తవారి యింటికి ముక్కామల వెడదామని బయలుదేరాను.

అప్పటికి నేను పంచాంగం చెయ్యడం మానుకుని వున్నాను, జాతకాలూ ప్రశ్నలూ మాత్రం చెబుతున్నా నింకా.

అనుకోకుండా, అప్పుడప్పుడు కొంచెంకొంచెం డబ్బు దొరుకుతూ వుండడం అందు క్కారణం.

రెండు గోదావరులు దాటి అడ్డదారిన నడిచివెళ్ళడమున్నూ అప్పటికి మానుకునివుండడంవల్ల ఉదయం యేడున్నరకి అనపర్తిలో రెయిలెక్కి తొమ్మిదిన్నరకి నిడదవోలు చేరుకున్నాను.

ఆ సమయానికి, నరసాపురం వెళ్ళే మెయిలు బోటుండేది; కాని ఆవేళ దాటిపోయింది.

311

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి