Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"సిద్దాంతం సిద్దాంతమే అని మాత్రం స్పష్టంగా చెప్ప” మనిన్నీ అన్నారు వారు.

గత రెండుదినాలూ జరిగిన పద్ధతే అది.

ఆవేళ పానుగంటి నరసింహారావువంతులుగారు కూచుని వున్నారు, నేను వెళ్ళేటప్పటి కక్కడ.

పరిచయం లేదు; గాని పిఠాపురంలోనే రెండుమూడుమాట్లు చూసివున్నాను వారి న్నేను, దూరంగా.

సుబ్బారాయడుగారు నా సంగతి చెప్పగా విని, కీగంట మాత్రం చూసివూరుకున్నారు పంతులుగారు.

నే నది గుర్తించకపోలేదు.

వా రలా చెయ్యడానిక్కారణమూ లేకపోలేదు.

రామకృష్ణకవులంటే యిష్టం లేదు పంతులుగారికి.

కోటలో జరిగిన మొదటి శతావధానంలో కాబోలు రామకృష్ణకవులు "వాసింగన్న కవీశ్వరుండు" అన్న మీసాలపద్యం తమ్ముద్దేశించి చెప్పిందే అని అప్పణ్ణుంచీ పంతులుగారికి, వారంటే వులుకు.

ఇదంతా నా కప్పటికే తెలుసు.

ఆ రామకృష్ణకవుల శిష్యుణ్ణి నేను.

ఈ స్థితిలో సంభవించింది నా రచన వారున్నూ వినడం.

భీమసింహుని చరిత్ర మొదట చదివా నా వేళ.

రాజపుత్రులు - వారిలో మిక్కిలి శిష్టులని పేరుపొందిన మేవాడు రాణాలు, అల్లాఉద్దీనుకు పద్మినీదేవి నద్దంలో చూపించి, అతణ్ణి గౌరవంగా సాగనంపడమూ - ఆ సందర్భంలో అల్లాఉద్దీను భీమసింహుణ్ణి చెరపట్టడమూ - దీనిమీద నేను ఆక్షేపణ చేశాను.

అది విని చకితులయినారు పంతులుగారు.

అది గుర్తించి సుబ్బారాయడుగారు పృథ్వీరాజు సంగతి కూడా వినమన్నారు పంతులుగారిని.

నేను చదివాను.

వినివిని "శతాబ్దులు గడిచాయి. ప్రపంచంలో చారిత్రిక విమర్శకు లెందరో ఆ ఘట్టాలు చదివే వున్నారు; కాని వారెవరూ చెయ్యని ఆక్షేపణ లివి" అన్నారు పంతులుగారు, కళ్ళుచికిలించి చూస్తూ వ్యంగ్యంగా.

అది భరించలేకపోయా న్నేను.

“సుబ్రహ్మణ్యశాస్త్రి వొక్కడే చెయ్యగల పని అది" అన్నానుకూడా, పెంకిగా,.

పంతులుగారు మరి మాట్టాడలేదు.

ఎదటివాణ్ణి, యిట్టే మాట అనేస్తారు కొందరు; తమకున్నూ అలాంటి మాట వచ్చి తగులుతుందన్న యింగితజ్ఞత లేకుండా.

సుబ్బారాయడుగారివంటి గంభీరులు మిక్కిలీ తక్కువగానూ వుంటారు లోకంలో.

ఆ చదవడం చదవడం భీమసింహుని చరిత్ర పూర్తిచేసి ప్రతాపసింగు రాణా చరిత్ర కూడా చదివాను, తరవాత.

309

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి