Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతకీ, -

చరిత్ర కానప్పుడు సంతతసాహచర్యంతో బాగా పరిశీలించి వొకరి అనుభవాలూ - జ్ఞాపకాలూ మరొకరు రాసినా రాయవచ్చు.

కాని, మన ఆంధ్రుల్లో యిప్పట్లో యిది అసాధ్యం.

ఏమంటే.?

మనవారి ప్రతిభాప్రాగల్బ్యాలు అర్ధంచేసుకోగలమే; గాని మనం అంగీకరించలేము. మనలోనూ సమర్థు లున్నారని అనుకోగలమే గాని ఆమాట పైకి చెప్పలేము.

నిరసించగలమే గాని - కనీసం తూష్ణీంభావంగా నైనా వుండిపోగలమే గాని మనవారిని ఆరాధించుకోలేము.

ఎంచేతనంటే?

“నేను”. అన్న అహంకారమే గాని "నాది" అన్న మమకారం పుట్టలేదు మన కింకా.

అయినా, తాత్కాలికావేశంతో యెవ రయినా అలాంటి పనికి పూనుకోడమే తటస్థించినా, అవి యెవరికి వారే రాసుకున్నంత నిక్కచ్చిగానూ వుండవు, సమగ్రంగానూ వుండవు.

దీనికి బలమైనదే వుంది, ప్రతిబంధకం వొకటి.

అనుభవాలలో కాయికాలకంటే మానసికా లుత్తమాలు.

అవి యెక్కువ కూడానూ.

మానసికాలకంటే హార్దికా లుత్తమోత్తమాలు.

అవే ప్రధాన మైనవి.

కనక, వొకరికవి బోధపరచడంకంటే రాసెయ్యడమే సుళువూ, మంచిదిన్నీ. అంచేతనే నా యీఇ పూనిక.

నా నమ్మకం మాత్రం వొకటుంది.

నా చిన్నకథలూ, నా నవలలూ, నా నాటకాలూ, నా రూపికలూ, నా వ్యాఖ్యానాలూ, యెవరి నయినా ఆకర్షిస్తూ వుంటే నా అనుభవాలూ - జ్ఞాపకాలూ కూడా వారి నాకర్షిస్తాయి.

ఈ విషయమై అత్యాశా నిరాశా కూడా లేవు నాకు.

కాక :- ఏ రచనైనా జిజ్ఞాసువులు చేతబెట్టడమో మానడమో అది కాలం పని.

పోతే :- మన తెనుగుజాతి, యివాళ, కొత్తదృక్పథంతో ముందుకి సాగుతోంది.

దానికి గల కారణాలు తెలుసుకోవా లంటే, ఆ ప్రగతికి ఆలంబనం అయినవారి జీవితరహస్యాలు పరిశీలించగలిగితేనే సాధ్యపడుతుంది.

దేశంలో నడుస్తూ వుండిన వృత్తం చూస్తే చాలదా అంటే, చాలదనే చెప్పాలి.

ఎంచేతనంటే?

అప్పుడు, వూహల కెక్కువ ప్రాధాన్యం యేర్పడుతుంది.

దానివల్ల, సత్యం, వొక్కొక్కప్పుడు దూరందూరం అయిపోతుంది.

కాకపోయినా, ఉన్న సాధనసామగ్రీ అవకాశమూ వినియోగించుకోకపోవడం అవివేకం అనిపించుకుంటుంది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

9