Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయం స్పందిస్తుంది.

ఆనందమున్నూ అనుభూతం అవుతుంది, దాంతో.

మరి, మరొకప్పుడు?

తక్కిన వాక్యాల - లేక - పద్యాల మాట?

ఏ రసికుడూ కూడా "ఈ కావ్యంలో యిక్కడే వుంది, ఇంతే వుంది రసం" అంటూ నిర్ధారణా చేయ్యలేడు, దానికి పరిమితీ కట్టలేడు.

ఏమంటే?

ఈశ్వరసృష్టివంటిది కవి సృష్టి.

కాళిదాసు రచనల కెందరో వ్యాఖ్యానాలు చేశారు.

ఎందరో యెన్నో సారస్యాలు తీశారు.

పూర్తి చెయ్యగలిగారా?

ఇంకా యింకా యెందరో కొత్త అందాలు చూపగలుగుతూనే వున్నారేం?

అయినా, యింకా యేదో నిగూఢంగా వుండిపోయినట్టే అనిపిస్తోందేం?

కవికీ రసికునకూ వుండే అంతరం అదిగో, అది.

రసికుని సత్తా సావధికం.

కవి సత్తా నిరవధికం.

ఇంతేకాదు.

అతనిది భౌతికం.

ఇతనిది ఆధ్యాత్మికం.

ఇంతమాత్రమున్నూ కాదు.

అఖండ గోదావరిలో జలపానం చేసే చలిచీమదీ, కవి రచనలో రసం ఆస్వాదించే రసికుడిదీ వొక్కటే అంతస్థు.

ఎంచేతనంటే?

రసికుడు రసపిపాసి మాత్రమే.

కవి రసస్రష్ట.

కాని ధనలోభం పుట్టిందా, కవి యీ శక్తి సన్నగిల్లిపోతుంది.

అటు దౌర్బల్యమూ ఇటు పతనమూను దీంతో, కవికి.

ఇలాంటిది తటస్థించకుండా వుండాలంటే, రసికు లైనవారు కవిని కనిపెట్టుకుని వుండాలి, సర్వకాల సర్వావస్థల్లోనూ.

కవికి, తన గ్రంథాలు స్వయంగా అచ్చువేయించుకునే దౌర్భాగ్యం పట్టకుండా చూడాలి.

చూడాలి కాదు, చూసుకోవాలి.

అంతమాత్రమే చాలదు.

కవిని ఆరాధించాలి.

కవిని అందలా లెక్కించాలి.

కవికి కనకాభిషేకం చెయ్యాలి.

ఇంతా చేస్తే కవి కిది "పత్రం పుష్పం ఫలం తోయ"మున్నూ మాత్రమే.

ఇక రసికులకా, ఇదే పరాయణం.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

304