సంసారంలో వున్నప్పుడు అవి తప్పవు.
కాని, కవి అయినవాడికి అవి గడిచిపోవడమే ప్రధానం.
కవితావేగాని కవి అడ్డంకులు కాలేవు.
భిల్లాంగనతో మన్మథతంత్రంలో మునిగిపోయివుండిన వాల్మీకే రామాయణం రచించాడు.
గాఢారణ్యాల్లో తపోనిష్టుడయివుండిన కృష్ణద్వైపాయనుడే మహాభారత గాధలో ప్రముఖపాత్ర అయినాడు.
అంటీ అంటని మహాకవుల యీ అవస్థ, లోకం బోధపరుచుకోనూ లేదు, అనుసరించా లేదు.
"ఆయన దరిద్రుడే; కాని సకలసంపదలకూ కారణభూతుడు. వల్లకాటిలోనే తిరుగుతూ వుంటాడు; కాని త్రిలోకాలకూ నాథు డాయన. భయంకరంగా కనబడతాడు; కాని శుద్ధసౌమ్యుడు" అంటూ నిర్వచించి "మహేశ్వరుడి యాథార్థ్యం తెలిసినవారు లే” రంది తపోనిష్ఠురాలయిన పార్వతి.
కవి యథార్థ్యమూ అలాంటిదే.
మహామహావ్యాఖ్యాతలున్నూ నిర్ధారణ చెయ్యలేకుండా వున్నా రది.
మనిషి యెంత నిర్లిప్తుడు కావచ్చునో అంత నిర్లిప్తుడూ కాగలడు, ఎంత లిప్పుడు కావచ్చునో అంత లిప్తుడూ కాగలడు కవి.
ఇచ్ఛామాత్రా లతనికా అవస్థలు.
అతని చూపుమాత్రం యే అవస్థలోనూ వొకటే.
అది క్రాంతదర్శిత.
కనకనే ఆకాశసౌధాల్లో విహరించే ఆగర్భ శ్రీమంతుల భోగభాగ్యాలూ వర్ణించగలడు, ఎలకల కలుగులవంటి చుట్టుగుడిసెల్లో తల దాచుకునే కటికిదరిద్రుల యమయాతనలూ చిత్రించగలడు, కవి.
సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మరి దేనిమీదికీ దృష్టి పోదు, మనిషికి.
రకంలో భిన్నమే గాని రాశిలో అలాంటి మనోధర్మమే కవిదిన్నీ.
అయితే, జీవయాత్రలో భంగపాటు తటస్థపడితే, ప్రపంచం మనిగిపోయినట్టు గోలపెట్టేస్తాడు మామూలు మనిషి.
కాయికంగా బాధపడుతూ, మానసికంగా నిర్వికల్పు డయిపోతాడా స్థితిలో కూడా, కవి.
అతని తాదాత్మ్యతకు నిదర్శనం అది.
రసలోలుపత అలాంటి విశిష్టత కలిగిస్తుం దతనికి.
“రసో వై సః”
నిజమే; కాని రసనిష్ఠ రసికునకూ కలుగుతుంది, కవి యెక్కువ ఏమిటీ? అంటే, అంతానూ.
ఒకమాటలో చెప్పాలంటే రసికుని రసనిష్ఠ యేకదేశం.
రసికుడైనవానికి, కవి రచనలో, వొకప్పుడొక వాక్యంతో - లేదా వొక పద్యంతో బుద్ధి చమత్కృతం అవుతుంది.
303
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి