Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనసంపాదన కవికి ధ్యేయం కాగూడదు.

కవికే కాదు, ధనసంపాదన యే కళావేత్తకూ ధ్యేయం కాగూడదు.

నిశ్చింతగా - చిన్న యెత్తున అయినా అతనికి కాలక్షేపం జరిగిపోవాలి - అంతే.

పంచభక్ష్యపరమాన్నాలే అక్కర్లేదు, చారునీళ్ళతో కాలక్షేపం చేసిన్నీ ఉద్గ్రంథాలు రచించగలడు కవి.

దారిద్ర్యమూ ఐశ్వర్యమూ కూడా ప్రేరకాలూ కాలేవు, భంజకాలూ కాలేవు కవిత్వానికి.

టాగూరు జమీందారు కనకనే - సాంసారికా లైన వడిదుడుకు లెరగనివాడు కాబట్టే అలాంటి ఉద్గ్రంథాలు రచించగలిగాడనీ, నోబిలుబహుమానమున్నూ గడించుకోగలిగాడనీ అనుకుంటా డనుకర్త.

కవితాసమాధిలో కూచున్నాడా - సరి అయిన తాదాత్మ్యం సిద్ధించిందా, ఇక అతనికి భోగాలమీదికీ దృష్టి పోదు, కష్టాలూ కనపడవు.

నీరసం వచ్చి చెయ్యి ముడుచుకుపోగూడదు, పేగులు మాడి దృష్టి చెదిరిపోగూడదు, ఈ ప్రతిబంధకాలు కలక్కుండా వుండడానికే కవి కాహారం.

ధనికు డైనవాడి కయినా కవితావేశం కలిగినప్పు డిదే ప్రవృత్తి.

పర్సులో (బహూమితంగానే) డబ్బుండినా, దృష్టి రచనావ్యగ్రమై కదలలేక - కలమూ కాగితాలూ కిందబెట్టలేక, కూరల కోసం బజారుకి వెళ్ళాలన్న స్ఫురణే కలక్క, "కూరగాయలేవీ లేవు మరి" అంటూ వంటింటోనుంచి కేక వినవచ్చినా ప్రకృతిలో పడలేక, వేళకి మాత్రం పీటమీదికి వెళ్ళి - ఆ పూటకు వూరుగాయలతోనూ చారు మజ్జిగలతోనూ భోజనం అయిందనిపించుకుని చెయ్యి ఆరడం తడువుగా మళ్ళీ కలంపట్టి, దాంతో, ప్రపంచం మరిచిపోయిన సందర్భా లెన్నో వున్నాయి, నా జీవితంలో.

"ఏదో" రాయకుండా వుండలేని నా స్థితే యిలా వుండగా, పద్యబంధం చేసినా వచనరచనే చేసినా మహాకవులే అయివుండినవారి స్థితి యెలా వుండనూ?

తెలుసుకోగలిగితే, ఈ భౌతిక దేహం నిలుపుకోగలగడానికి ఫలానా మాత్రమే అగత్యం అన్న నిర్ధారణ లేదు.

వేషం విషయమై కూడా అంతే.

ఉజ్వలవేషంతో వీధిలోకి వస్తాడు కవి, ఒక్కొక్కప్పుడు.

ఎంత డాబురా అనుకుంటా డల్పబుద్ధి.

చింకిపాతలతో కనపడతాడు కవి, మరొక్కొక్కప్పుడు.

“వో-ట్ఠి దరిద్రుడు" అనుకుంటుంది మాయలోకం.

పరిశీలిస్తే, ఆ భావనా యీ ఘోషణా కూడా అవివేకజన్యాలే.

ఏమంటే?

అతను మహర్షి అనడానికి నిదర్శనం అది.

ఆ చీనిచీనాంబరాలూ ఆ చింకి పాతలూ కూడా అతని ఇచ్ఛాపూర్వకాలు కావు.

లోకంలో శరీరధర్మాలు కొన్ని వున్నాయి.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

302