Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవి అయినవాడికి నిద్రాహారాలకంటేనూ యెక్కువ ఆవశ్యకమయిందీ ప్రేరణ.

ఈ ప్రేరణ తన్మయీభావం కలిగిస్తుంది కవికి.

ఈ ప్రేరణ దీక్ష పుట్టిస్తుంది కవికి.

ఈ ప్రేరణ ఆ దీక్షకు ఏకాగ్రత సంఘటిస్తుంది కవికి.

దాంతో రాత క్కూచుంటాడు కవి.

రాయగా రాయగా భాష స్వాధీనం అవుతుంది కవికి.

రాయగా రాయగా రచనావిధానం సుపరిష్కృతం అవుతుంది కవికి.

రాయగా రాయగా క్రాంతదర్శిత నిశితం అవుతుంది కవికి.

రాయగా రాయగా తపస్సు సిద్ధించి మహర్షి అవుతాడు కవి.

“నానృషి, కురుతే కావ్యమ్"

మహర్షి కానివాడు కావ్యం రచించలేడు.

మహర్షి కానివాడు రచించినది కావ్యమూ కాలేదు.

మరి వొక్క రోజులో మహర్షి కాగలడా యెవ డయినా?

సోపానక్రమంగా ఎంతో సాధన కావాలి దానికి.

రాతప్రతి అయినా అచ్చుప్రతి అయినా గ్రంథం నలుగురి చేతుల్లోనూ పడ్డం ఆ సోపానాల్లో వొకటి.

అలాగ వొకటితరవాత వొకటిగా యెన్నో సోపానాలెక్కితే గాని తత్కర్తకు తన భంగపాటేదో తెలియదు.

తనకి సాధ్యం - సాధించుకోవలసింది - ఏమిటో తెలియదు.

అది తెలిస్తే గాని అడుగు ముందుకి పడదు.

పడితే తప్ప సిద్ధి యెక్కడిదీ?

తన గ్రంథం తానే అచ్చువేయించుకోవలసివస్తే మాత్రం ప్రేరణ దుర్బలమూ, సిద్ధి దుర్లభమూ అయిపోతాయి, కవికి.

ఈ విషయమై కొందరి కపవాద (మినహాయింపు) లుండవని కాదు; కాని మొత్తాని కిది కవులకు దౌర్భాగ్యం.

ఏమంటే?

తన గ్రంథం తానే అచ్చువేయించుకుంటే, పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకోడమూ, తన సంసారం నిర్వహించుకోడానికీ మరో గ్రంథం అచ్చువేయించుకోడానికీ తగినంత లాభం లాగడమూ - ఇలాంటి ధోరణిలో పడిపోతాడు కవి.

దీనివల్ల అతని కవితాతపస్సు భంగపడిపోతుంది.

కవికి కాదు, తెలుసుకోగలిగితే జాతికే తీరని నష్టం అది.

అయితే, కవి అయినవాడల్లా దరిద్రుడయి వుండాలని కాదు.

కవి అయినవాడల్లా ధనికుడయి వుండకూడ దనిన్నీ కాదు.

ధనికత్వమూ నిర్దవికత్వమూ లోకసామాన్యాలు.

మరి కవి?

లోకాతీతుడు.

కనక?

301

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి