మొత్తానికి కవి బాధ్యత యిది.
కవి ప్రాప్యమున్నూ యిదీ.
నలుగురూ చదవడమూ, పాఠకుని హృదయం స్పందించి మొగం ఆనందోత్పుల్లం కావడమూ, ఆ మనిషి కెంతో కొంత సంస్కారమున్నూ అబ్బడమూ, ఆవిధంగా తన జీవితం ధన్యం కావడమూ - ఇదీ తన రచనవల్ల కవి సాధించుకోవలసినవి.
నలుగురూ తన ప్రతిభ గుర్తించడమూ, కొంచెమయినా తనని మెచ్చుకోడమూ కూడా ఈ పద్దులోవే, సందేహం లేదు.
అయితే, గౌణా లివి.
ఆనుషంగికాలున్నూ.
అవి సిద్దిస్తేనే సిద్దించేవిన్నీ యివి.
నిజమే; కాని "అచ్చుపడే ప్రతీగ్రంథానికీ యీ శక్తి వుంటుందా?" అంటే, పోనీ, వుండేదాని మాట?
అది నిర్ధారణ కావడం మాత్రం యెలాగా?
చెట్టున పుట్టే ప్రతీపిందే సారవంతం కాదు.
నిలవనూ నిలవదు.
మరి, నిలిచే దేదో యెలాగా చెప్పడం?
అలాంటిదే కవుల గ్రంథాల విషయమున్నూ.
కాక, - పూర్వకవులు రాసిన గ్రంథాలు కొంచెమే వున్నాయి, మన కిప్పుడు.
ఆ రోజుల్లో యివి మాత్రమే పుట్టాయా?
కవులున్నూ వీరు మాత్రమే వుండినారా అప్పుడు?
నన్నయ్య భారతాది మాత్రమే రచించాడా?
తిక్కన్న భారతోత్తరభాగం మాత్రమే రచించాడా?
ఎర్రన్నా, శ్రీనాథుడూ, పెద్దన్నా, తిమ్మన్నా, రామరాజ భూషణుడూ - మొదలైనవారు ఇప్పుడు మనకు లభ్యాలయి వున్న పెన్నిధులు మాత్రమే రచించారా?
కాదు కాదు, అలాంటి వికరమైన శక్తీ నేర్పూ అలవడ్డానికి, వారు, ఎన్నో శతకాలూ, పద్యాలూ, మరింకా యెన్నో గ్రంథాలూ రచించివుంటారు, సాధకావస్థలో.
అయితే, యిప్పటి అనేకుల్లా కాక, వా రపరిమితమైన సంస్కారం గలవారు కనక, వారి ఆ ప్రాథమిక రచనలున్నూ జను లాదరించే వుంటారు.
కాని తపస్సిద్ధి కాక పూర్వం రచించినవి కనక, అవి కాలం సుడిగుండాలు తప్పించుకోలేక నశించిపోయి వుంటాయి.
అలా పోయినవి పోగా రత్నాలే మనకి మిగిలాయి.
ఎప్పు డయినా గట్టిగింజలే మిగులుతాయి; కాని పొల్లు గింజలకున్నూ పని తప్పనిదే.
కనక, గ్రంథం తయారయిందా అచ్చుపడవలసిందే, ఇప్పుడు.
దానివల్ల యితరులకు ఆనందాదిప్రయోజనం కలిగినా కలక్కపోయినా, అవి అచ్చు పడ్డంవల్ల మరో గ్రంథం రచించాలన్న ప్రేరణ కలుగుతుంది కవికి.
కవి అయినవాడికి ప్రాణాలకంటేనూ విలవయిం దీప్రేరణ.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
300