Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయితే, రాశానే కాని ప్రకటించడానికి శక్తి లేకపోయింది నా కది.

సంపన్నులను కొందరిని చూశాను, ప్రయోజనం లేకపోయింది.

అంతా కాకపోతే, కొంతవర కయినా సాహాయ్యం చేసిన సంపన్నులు మాత్రం కొంద రున్నారు, వారిలో అనపర్తి కాపురస్థులు ద్వారంపూడి రామారెడ్డిగారు. ముఖ్యులు.

పెద్దరెడ్డిగా రని వారికి వ్యవహారం.

మహానుభావులు వారు, కైలాసవాసు లిప్పుడు, బతికివుండినంతకాలమూ ఔదార్యమూ సౌజన్యము మూర్తీభవించినవారని ప్రఖ్యాతి వారికి.

వారి తండ్రి గంగిరెడ్డిగారినిన్నీ బాగా యెరుగుదు న్నేను, గంగిగోవు అన్నమాట వారికే చెల్లుతుంది.

గంగిరెడ్డిగారు మా నాయనగారికి వార్షికం యిచ్చేవారు, అందుకోసం రెండుమూడుమాట్లు 'వెళ్ళా న్నేను, అంచేత, చిన్నప్పణ్ణుంచీ నాకు బాగా పరిచయం వుంది రామారెడ్డిగారితో.

వారి ఔదార్యాన్ని కెందరో యెన్నో వుదంతాలు చెప్పగా ఆశపడి, నమ్మి, పనికట్టుకుని వెళ్ళి "యిది అచ్చువేయించి పెట్టం"డని కోరా నొకనాడు, రాత ప్రతి చూపించి.

వినివిని "నే నొక్క వందరూపాయ లిస్తాను, పైగా పడేది మరోచోట చూసుకోండి, వొక్క వారందినాల్లో రండీ" అన్నారు వా రవ్యవధానంగా.

ఆ పుస్తకాని కిది చాలదు.

అయినా నూరురూపాయల మొత్తం చేదు కాదు కనక, సరిగా వారందినాలకే వెళ్ళాను; గాని "యింకో వారం" అన్నారు రెడ్డిగారు నన్ను చూస్తూనే.

ఆ బుధవారమే వారం వారం వెళ్ళాను, వూళ్ళోవుంటే.

అంత పెద్ద మొత్తం అంతకితం యెప్పుడూ వొక్కమాటుగా నా చేతికి రాలేదు, కనక, మాసం కాదు - రెండు మాసాలు కాదు - ఆరుమాసాలు వెళ్ళా నలాగ వారంవారమూ.

పన్నెండు గంటలకు భోజనం చేసి చుట్టకాలుస్తూ రెడ్డిగారు హాల్లో పచారుచేసే సమయమూ, నేను వారి గుమ్మం యెక్కే సమయమూ వొక్కటిగా వుండేది, తరుచు.

“మళ్ళీ వారం"

"మళ్ళీ వారం"

“మళ్ళీ వారం"

ఈ వొక్కమాటే పెట్టుకున్నారు నాతో మాట్టాడ్డానికి రెడ్డిగారు.

ఈ ఆరుమాసాల్లోనూ వారి ఔదార్యం ఇంకా యింకా తెలిసింది.

ఆ మాట అనడానికి వారికీ, ఆ మాటమీద వెళ్ళడానికి నాకూ గూడా విసుగన్నది లేకుండా పోయింది.

కాని "ఏమిటిదీ ?" అనిపించిం దొకనాడు, హఠాత్తుగా.

గుమ్మం దిగి వెనక్కి మళ్ళాను, ఆలోచనలో పడ్డాను.

293

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి