Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాక; - దుర్యోధనుడి తొడలు విరగ్గొడతా నని తన శపథమా?

ద్వైపాయనహ్రదం దగ్గిర జరుగుతున్నది అటో యిటో తేల్చివేసే చివరి యుద్ధమా?

మరి, కృష్ణుడు సన్నచేస్తేగాని భీముడు గదతో దుర్యోధనుడి తొడలమీద బాధలేకపోయాడేం?

అలాంటిదే యిదీని.

ఆ అవస్థలో పడే మా వూరు వచ్చాడు వేంకటనారాయణ.

వచ్చిన ఉత్తరక్షణంలోనే ఉపాయం చెప్పి నే నతణ్ణి పంపేశాను.

కాకినాడ కాలేజీ సంగతి జ్ఞాపకంచేసి మళ్ళీ సుబ్బారాయుడుగారి నాశ్రయించమనే ఆ వుపాయం.

పిఠాపురం అంటే, సుబ్బారాయడుగారి పేరే తట్టే దెవరికైనా.

సుబ్బారాయడుగారిని నమ్ముకునే వచ్చేవారా రోజుల్లో పిఠాపురం యెవరు వచ్చినా.

సూటిగా మహారాజులుంగారి దర్శనమే కావాలంటే సాధ్యంకాదు, మరి.

“అగ్నిముఖా వై దేవా..”

ఇదే సూత్రం యిక్కడాను - "మంత్రిముఖా వై రాజానః"

చక్రవర్తి - లేక మహారాజు - లేక - రాజు - లేక జమీందారు అయిన ప్రతీమనిషి దగ్గిరా వుంటాడు ఏదో వొక యెత్తున, దివా ననిపించుకునే మనిషి.

అయితే, తెనుగుదేశంలో, "దివాను" అని చెప్పదగినవా రిద్దరే - వొకరు కొమర్రాజు లక్ష్మణరావుగారూ, మరొకరు మొక్కపాటి సుబ్బారాయడుగారున్నూ.

జీతం లేకుండా కాకినాడ కాలేజీ చదువుకూడా పూర్తి చేసుకోడానికి వేంకటనారాయణ కవకాశం కల్పించారు సుబ్బారాయడుగారు, ప్రార్థించడం తడవుగా.

అప్పటి కది సెకండుగ్రేడు కాలేజీ.

అయినా హైస్కూలుకి పైమెట్టు కావడంవల్ల అందుకే మిక్కిలి సంతోషించాడు వేంకటనారాయణ.

అపజయమన్నది లేకుండా అక్కడి చదువున్నూ రెండేళ్లల్లో పూర్తిచేసేశా డతను.

తృష్ణమాత్రం తీరలే దతనికి.

అయితే, సుబ్బారాయడుగారి చేతిలోనా ఫస్టుగ్రేడు కాలేజీ లేకపోయె, అలాంటి కాలేజీ చేతిలో వున్న దివా వాసుబ్బారాయుడుగారివంటివా రవునో కాదో తెలియదాయె.

కాని యేనుగుకుంభస్థం బద్దలుకొట్టేదాకా వూరుకోదు సింహం.

బి.ఏ. కాకుండా వుండలేకపోయాడు వేంకటనారాయణ.

ఏటి కడ్డపడ్డా డప్పుడు.

విజయనగరం ప్రవేశించా డాకసితోనే.

జీతమే కడుతూ వచ్చాడో, అక్కడా దివాన్‌గా రనుగ్రహించారో మరి, రెండేళ్ళలోనే బి.ఏ. అయిపోయా డతను.

మరో రెండేళ్ళకి ఎల్.టి. కూడా అయిపోయాడు రాజమహేంద్రవరంలో.

అనన్యసాధారణమైన ఆ అభ్యుదయపరంపర చూసి శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రిగారు తమ కొమార్తె నిచ్చి అంతకి ముందే వివాహం జరిగించా రతనికి.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

290