ఒక్క వేంకటనారాయణే కాదు, ఎంతెంతలేసి పరీక్షల్లోనూ మిక్కిలీ సుళువుగా నెగ్గెయ్యగల యువకు లింకా వేలూ లక్షలూ వున్నారు దేశంలో; వారి ప్రతిభ అంతా దేశానికీ జాతికీ సంచితం చేసిపెట్టగల ధర్మసంస్థలే లేవు, మనకిప్పుడు.
నిజమే కాని మనజాతి కిది కొత్తసంగతి.
విద్యాదానం వుందే గాని పాఠశాలదానం లేదు మనలో యెప్పుడూ కూడా.
విద్యాదానం పండితకర్తృకం; సంపన్నులు చెయ్యవలసిందీ, చెయ్యగలిగిందీ కానేకాదు.
పండితులు విద్యార్థులకు విద్యాదానం చెయ్యడమూ, సంపన్నులు అన్నదానం చెయ్యడమూ - ఇదీ మన సంప్రదాయం.
మన దేశంలో, విద్య, యేయుగంలోనూ కూడా ప్రభుత్వపరంగా లేదు.
గురుకులవాసమే మన విద్యాసంస్థ.
కానీఖర్చులేకుండా సకలశాస్త్రాలూ సాధించుకునేవారు మనవాళ్ళు.
గురుకులవాసం చదువుతోనే మనవాళ్ళు మహాపండితు లయినారు, శాస్త్రకారు లయినారు, చక్రవర్తు లయినారు, మహామంత్రు లయినారు, ద్వీపద్వీపాంతరాల్లోనున్నూ మన సంస్కారం వ్యాపింపజేశారు.
మనదేశంలో, ప్రతీపట్నంలోనూ - పెద్ద పెద్ద పల్లెల్లో కూడా అన్నసత్రాలు వెలిశాయి గాని, పాఠశాలా భవనాలు వెలియలేదు, పరకాయించి చూస్తే.
పండితులు తమకి తామే విద్య చెప్పేవారు విద్యార్థులకు.
అగ్రహారాలూ, వృత్తులూ, మాన్యాలూ, వార్షికాలూ యిచ్చి ప్రభువులూ, సంపన్నులూ ఆ పండితులను పోషించేవారు, సేవ్యసేవక సంబంధం మాత్రం పెట్టుకోకుండా.
విశ్వవిద్యాలయాలూ వుండేవి; కాని అవీ పండితుల స్వత్వాలే ప్రభుత్వానివి కావు.
ఆ విశ్వవిద్యాలయాలున్నూ ప్రభువులూ, సంపన్నులూ పోషించేవారు.
విద్యార్థులకు అన్నం పెట్టి, బట్ట లిచ్చి విద్య చెప్పేవవి.
వాటి నిర్వహణవిధీ, బాధ్యతా ప్రధానాచార్యునివి.
ఆయనకే కులపతి అని బిరుదు.
పదివేలమందికి అన్నవస్త్రాలిచ్చి విద్య చెప్పేవాడే కులపతి అని మనవారి నిర్వచనం.
ఆ కులపతుల యెదట రాజులూ, మహారాజులూ, చక్రవర్తులూ చేతులు కట్టుకుని మసిలేవారు, ఏలోటూ లేకుండా మాత్రం చూస్తూ.
ఓనమాల దగ్గర్నుంచీ విద్యార్థులు నెలనెలా ముడుపు చెల్లించి నేర్చుకోడమూ, ఉపాధ్యాయుల జీవితాలు దొరతనంవారు తమ గుప్పిట్లో యిరికించుకుని వుండడమూ, పరీక్షల యేర్పాటూ, చివరకి విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ, పైవారిలోనూ రకరకాల లుకలుకలూ - ఇదంతా మన కాంగ్లేయులు ప్రసాదించిన నవనాగరికత.
పోనీ, ఆ ఆంగ్లేయులు వెళ్ళిపోయారు గదా - ప్రభుత్వయంత్రం మన చేతుల్లోకే వచ్చింది కదా, విద్యావిధానంలో. మళ్ళీ మన సంప్రదాయం ప్రవేశపెడతారా మనవాళ్ళు?
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
288