Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక్క గంటలో ఏ.బి.సి.డీలు గుర్తుపట్టేశా డతను.

ఒక్క నెల తిరిగేటప్పటికి గురువుతో అతని అంతస్థున మాట్టాడసాగా డింగ్లీషు.

దీంతో అతనికోసం మరో గురువుని చూడవలసివచ్చింది నేను.

శ్రీపాద సూర్యప్రకాశంగా రని ఆ వీధిలోనే నే నెరిగిన వొక పట్టభద్రులు.

జగత్ప్రసిద్ధతార్కికులు శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రిగారి పెద్ద కుమారు లాయన.

బహూ సౌమ్యులు.

తరుచు లక్ష్మీ నరసింహశాస్త్రిగారి దర్శనం చేసుకుంటూ వుండడంతో వారితోనూ పరిచయం యేర్పడివుంది నాకు.

వేంకట నారాయణను చూపించి పరిస్థితులన్నీ చెప్పి అనుగ్రహించవలసిందని కోరా న్నేను వారిని.

వా రంగీకరించా రందుకు.

దీనికి సాయం, ఆ యింగ్లీషుపరిచయంతో ఇంగ్లీషు చదివే ఆ వీధి కుర్రవాళ్ళందరితోనూ సాహచర్యం అబ్బిం దతనికి.

ఒక విధంగా వారిని కూడా అందరినీ గురువులుగానే భావించుకున్నా డతను.

వారు లెక్కలు చేసుకుంటూ వుంటే అతనూ చేశాడక్కడ కూచుని.

ఇంగ్లీషు నేర్చుకుంటూవుంటే, అతనూ వల్లించాడు వారితోపాటు.

వా రాటల్లో దిగితే తాను మాత్రం అందుకు సిద్ధపడక ఆడుతూపాడుతూ సర్వ విషయాలూ ఆకలించుకున్నాడు, పువ్వుపువ్వునా తుమ్మెద మకరందం సేకరించుకునే టట్టు.

తరవాత వొకటిరెండు మాసాల్లోనే హైస్కూల్లో క్లాసు పరీక్షలు జరిగాయి.

సూర్యప్రకాశంగారి ప్రోత్సాహంతో అందుకు సిద్ధపడ్డాడు వేంకటనారాయణ.

అప్పు డక్కడి హైస్కూలు హెడ్మాష్టరు కూచి నరసింహం పంతులుగారు.

మూడు మాసాల పరిశ్రమతో, అంతవరకూ ఇంగ్లీషు ముక్కూ మొగమూ యెరగని వేంకటనారాయణ ఆ పరీక్షల్లో కూచుని థర్డుఫారం పాసైనాడు.

"ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా.”

ఇలాంటి సందర్భాలు చూసే కాళిదా సీసూక్తి వెలయించి వుంటాడు.

అయితే, గత సంవత్సరం తాలూకు జీతం అంతా చెల్లిస్తే అతణ్ణి పై తరగతిలో చేర్చుకుంటా మన్నారు నరసింహం పంతులుగారు.

పాఠశాల నిబంధనల ననుసరించి అది అంతే అయివుండవచ్చు; కాని ఆసక్తే గాని ఆ శక్తి యేదీ వేంకట నారాయణకు?

పుస్తకాలే పాతవి సంపాదించుకోవలసినవా డతను, ఏ నెల కానెలదే కట్టలేడే, సంవత్సరం జీతమూ వొక్కమాటు గుమ్మరించాలంటే అతని తరమా, పోనీ అంటే, నా వశమా?

దిగ్భ్రాంతులం అయిపోయాం మేమిది విని.

రుచి లేక ఆ చదువు దూరం కాగా, డబ్బు లేక యీ చదువు దూరం అయిపోయే స్థితి వచ్చింది.

287

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి