Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదిన్నీ లేకపోడం చూసి తెల్లపోయా న్నేను.

దీనికి సాయం, కొత్తశ్లోకం చూసుకోడంలో తనకి కొంచెం సాయం చెయ్యమని కోరాడు నన్నతను.

అంటే, మొదట నేను స్థూలంగా పాఠం చెబితే, తరవాత, గురువుగారి దగ్గిర సూక్ష్మంగా పాఠం చెప్పుకుంటా డన్నమాట అతను.

కష్టమూ లేదు, నష్టమూ లేదు, చెప్పనేవచ్చు.

అయితే, మాఘం చదివే వాటి కలాంటి సాయం అగత్యం అయితే ఆ మనిషి యిక తేలడం అంటూ వుంటుందా?

చూసిచూసి “నీ కర్థజ్ఞానం కలగడం యెప్పుడు, సత్యనారాయణవ్రతకథ అయినా చెప్పగలడానికి శక్తి రావడం యెప్పుడు, సంస్కృతజ్ఞానంతో ఏదోవిధంగా పొట్టపోసుకో గలగడమున్నూ యెప్పు" డని అతణ్ణే అడిగాను సాహసించి నే నొకనాడు.

అమాయికు డతను "నా తపనా అదే” అన్నాడు. దాపరికం లేకుండా.

గుండెల్లో కలుక్కుమంది నాకు.

పోనీ అతను సోమరి యేమో అంటే యెంతమాత్రమూ కాడు.

ఇక వున్నదల్లా యేమిటంటే?

అతనికీ సంస్కృతసాహిత్యానికీ చుక్కెదురు.

అంటే దానిమీద రుచిలే దతనికి.

రుచి లేదు కనక అతని కంటడంలే దది.

అంటడం లేదు కనక గుంటపువ్వులు పూస్తున్నా డతను.

నే నది గుర్తించాను.

నాక్కావలసిన విద్య నన్ను మావాళ్ళు సాధించుకోనివ్వలేదు, అతనివాళ్ళు అతనేమి చదువుకున్నా అడ్డుపెట్టరు; కాని తనకి కావలసిన విద్య యేదో అత నెరగడు - ఇదీ నాకు అతనికీ భేదం.

దీంతో అతని స్థితి గుర్తించి "సాయపడగలమా?" అని బాగా ఆలోచించాను.

ఒకదారి కనపడింది.

రామవరం అని దక్షిణంగా మావూరి కొక సమీప గ్రామం.

ఆ గ్రామానికి చెందిన బుద్ధవరపు రామరాజు వెంకటరాజుగార్ల కుటుంబం కొంత, పిల్లల చదువుకోసం ఆ వూళ్ళో ప్రవేశించి వుం దప్పుడు.

మాకూ ఆ కుటుంబీకులకూ చిరపరిచయం.

ఆ పిల్లల్లో కొందరు మా పొలమూరికే చెందిన తటపర్తి నరసింహంగారి దౌహిత్రులు.

వారిలో పెద్ద - అంటే రామరాజుగారి కుమారుడు థర్డుఫారం చదువుతున్నాడప్పుడు.

పొలమూరి సిద్ధాంతిగారి అబ్బాయిని కనక ఆ కుటుంబానికీ, అప్పటికే నేను కవిని కనక ఆ పిల్లలకూ నేనంటే యెంతో ఆదరభావం.

ఈ చనువు పురస్కరించుకుని, ఆ పిల్లల దగ్గిర వున్న వెనకటి తరగతి పుస్తకా లడిగి పుచ్చుకుని, ఆ థర్డుఫారం విద్యార్థిచేతనే వేంకటనారాయణకు చెప్పించా నింగ్లీషు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

286