Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకజ్ఞానానికి లోకజ్ఞానమూ కలిగిస్తాయి.

ఉత్సాహానికి ఉత్సాహమూ రెట్టిస్తాయి.

బుద్ధికి మారాకు వేసి, ప్రతిభకు నవనవోన్మేషం అలవర్చి, చూపులకు వెలుగు తోపించి, నరాలకు బింకం పుట్టించి, ఆ జిజ్ఞాసువు నొక్కొక్క మెట్టే యెక్కించుకునిన్నీ పోతాయి, చెయ్యిపట్టుకుని.

2

“కావచ్చు - అయితే, అంత విశిష్టత వుందనే వేంకట శేషయ్యగారు నీ అనుభవాలూ - జ్ఞాపకాలూ ప్రకటించడానికి పూనుకున్నారా?” అంటే, యేమో, అది వారు చెప్పవలసిన సంగతి.

నానమ్మకం యేమిటంటే?

ఇంగ్లీషు చదవడంవల్ల మాత్రమే వేంకట శేషయ్యగారికి జర్నలిజంలో రుచిపుట్టి వుండలేదు.

పత్రికానిర్వహణానుభవమున్నూ వారికి నవోదయతోనే ప్రారంభం కాలేదు.

అదృష్టంవల్ల, ప్రతిభకు సాయం మద్రాసులో వారికి నివాసం తటస్థపడ్డది.

ఆ మద్రాసు నవనాగరికత కొక విశిష్టస్థానం.

అక్కడి భౌతికదృష్టికి భారతదేశంలో ప్రత్యేకత వుంది.

అక్కడి లోకజ్ఞానం బాగా పరిణత మైనది.

అక్కడి సాహచర్యం కొత్తదారులు తొక్కించగలది.

దీనికి సాయం, ఆ మద్రాసులో చిన్నా పెద్దా - సాధారణాలూ అసాధారణాలూ యెన్నో పత్రికలు.

అవిన్నీ రకరకాలు.

భిన్నజాతులు నిర్వహించే పత్రికలు - భిన్నదృక్పథాలు అలవరిచే పత్రికలు - భిన్నలక్ష్యాలు సాధించే పత్రికలు - భిన్నప్రాప్యాలు ఆశించే పత్రికలు,

ఊళ్ళవూళ్ళ నుంచీ, దేశదేశాలనుంచీ, ఖండఖండాలనుంచీ కూడా కురిసిపోయే పత్రికలున్నూ యెన్నో అక్కడ.

ఇది చాలదన్నట్టు ఆంధ్రజాతికి జీవనజ్యోతిఅయిన ఆంధ్రపత్రికలో వారికి పూచీగల పదవి.

అన్నిటికీ శిఖరాయమానంగా కళాదృష్టి.

నాటకాలతో - ఫిలిములతో - సాహిత్యసభలతో - సాహిత్య నిర్మాతలతో సాహచర్యమూ, సహజీవనమూ, నిర్వహణప్రసక్తిన్నీ.

చాలు, వేంకటశేషయ్యగారి దృష్టి కుశాగ్రసూక్ష్మం కావడానికీ, చూపు నిశితం కావడానికీ, ప్రతిభ నవనవోన్మిషితం కావడానికీ, ఆశయాలు మహోన్నతాలు కావడానికీ, ఆరంభాలు నిస్స్వార్థాలు కావడానికీ, ముఖ్యంగా జర్నలిజం చక్కగా అవగాహన అయివుండడానికీ వేరే సాధన సామగ్రి అక్కరలేదు.

6

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి