Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరికీ అందలేదు ధోరణి.

మల్లయ్యశాస్త్రిగారు చాలా ఆలోచించారు; కాని లాభం లేకపోయింది.

దాంతో "ఎత్తుకున్న మాట యేమిటి?" అన్న ఆకాంక్ష - “కని పెట్టలేకపోవడమేనా?” అన్న శౌర్యం - "వయస్సూ అనుభవమూ వ్యర్థాలేనా?" అన్న అభిమానం - "సభ్యులేమనుకుంటున్నారో?” అన్న దిగులు - “పడగొట్టితీరా”లన్న కసి - ఇన్ని మానసిక వికారాలు స్పష్టంగా అంకితం అయినాయి వారి మొగాన, ఆ క్షణాన.

ఏమయినా, అలాంటి సందర్భంలో దీర్ఘాలోచనలో మునిగిపోయి వుండడమున్నూ గౌరవాస్పదం కాదు.

కనక “కాని”మ్మన్నట్టు చెయ్యూపేశారు వారు, విధిలేక.

"స” అన్నారు రామకృష్ణశాస్త్రిగారు కొదమసింహంలాగ, యెగిరిగంతు వేసి.

"పున్నెపు బస" అయిందిక్కడికి.

వేంకటరామశాస్త్రిగారి మొగం వికసించింది.

అందరూ ఊపిరి తీసుకున్నారు.

కాని అపాయం దాటలే దింకా.

ఇంకొక గురువుతో గాని ఆ పొదం పూర్తి కాదు.

మూడోపాదం మొదటిమాట మొదటి అక్షరమున్నూ అక్కడ ప్రారంభించవచ్చు.

ఇది మరీ అపాయకరం అవధానికి.

కావచ్చు; కాని వంతు మల్లయ్యశాస్త్రిగారిది.

వారు మళ్ళీ ఆలోచించారు.

"గౌరవం దెబ్బతింటోందన్న వుడుకుతో మరీ ఆలోచించారు.

అయినా, ఫలితం అంతే అయింది.

ధోరణి అందలేదు.

కారణం వెనకటిదే - అది పదాది.

తప్పితే పాదాంతపూరణాక్షరం కావడమున్నూ.

అది వొకటే కాదు, లక్షరకాలు.

అయితే, ప్రతీ అక్షరమూ నిషేధించడం గొప్పే; కాని నిషేధించకపోడం మాత్రం తప్పుకాదు.

ఒక్కొక్క చోట నిషేధించడం కూడా చాపలం క్రింద లెక్క అవుతుంది.

కనక, నిషేధిస్తే మాత్రం పకడుగా వుండాలి.

అవధాని పిల్లిమంతరాలు వెయ్యాలి, దాంతో.

ధర్మం యిది కనకా, చేసేదిన్నీ లేదు కనకా, మల్లయ్య శాస్త్రిగారు మళ్ళీ చెయ్యూపేశారు “కాని"మ్మన్నట్టు.

"యౌ" అనేశారు రామశాస్త్రిగారు, వెంటనే.

"పున్నెపుఁబసయౌ” అంటూ రెండో చరణం పూర్తి అయిపోయింది.

సభ్యులందరూ దీర్ఘనిశ్వాసాలు విడిచారు, ప్రాణాలు కూడదీసుకుంటున్నట్టు.

ఆందోళనపడుతున్న వేంకటరామశాస్త్రిగారు నిటాగ్గాకూచున్నారు, రామకృష్ణశాస్త్రిగారిని చూపులతో పొదువుకుంటూ.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

272