రెండో చరణంలో యతిదగ్గిరికి వచ్చేటప్పటికి మరీ వుద్రిక్తులయిపోయా రిద్దరూ.
ఒక్క ఆయుధాలే పుచ్చుకోలేదు; గాని వొకరి నొకరు సంహరించుకోడానికి తలపడ్డ మహాయోధు లన్న ట్టయిపోయారు వా రిద్దరూ.
యోధు లయితే ప్రాణా లొడ్డుకుంటారు, పండితులు కనక మానా లొడ్డుకున్నారు. శాస్త్రులవా రిద్దరూ, ఇదే భేదం.
తహతహ లాడిపోయారు సభ్యులందరూ.
ఈ స్థితిలో రామకృష్ణశాస్త్రిగారు “పు” అన్నారు, నిర్లక్ష్యంగా.
వెంటనే "ణ్య" నిషేధించారు మల్లయ్యశాస్త్రిగారు నిర్ధాక్షిణ్యంగా.
“పుణ్యము” అనబోయి "ణ్య" నిషిద్ధం కాగా, "న్నె" అన్నారు రామకృష్ణశాస్త్రిగారు.
అది గుర్తించి "ము" వెయ్యరా దన్నారు మల్లయ్యశాస్త్రిగా రవ్యవధానంగా.
ఆటకట్టిపోయివుండును సామాన్యులయితే.
అందరమూ కట్టిపోయిందనే అనుకున్నాము కూడా.
మల్లయ్యశాస్త్రిగారి మొగాన గర్వరేఖ మెరిసింది, దాంతో.
వేంకటరామశాస్త్రిగారు బహు ఆదుర్దా పడిపోతున్నారటు చూస్తే.
కాని, ఇటు చూస్తినిగదా, దరహాసభాసమానం అయివుంది రామకృష్ణశాస్త్రిగారి ముఖం.
బెల్లించి చూస్తున్నాయి, వారి కళ్లు.
నేను చకితుణ్ణయినా నది చూసి.
ఇంతలో "పు" అన్నారు రామకృష్ణశాస్త్రిగారు, విలాసగా.
"పున్నెపు” అయిందక్కడికి.
సంతోషమే; కాని మాట పూర్తయిందనుకుంటే మొదలే అయింది మళ్లీ.
ఆ కావడం విషమంగా అయింది, విశేషించి.
అసలు, మూడక్షరాల మాట అందుకోడమే చిక్కులకు కారణం, నిషిద్ధాక్షరిలో.
ఆ మూడో అక్షరం కర్మధారయలోకి దిగిపోడం మరీచిక్కు.
అది పులివాత పడ్డమే నిజంగా.
అయినా, వొక్కొక్కప్పు డది తప్పనూ తప్పదు, సమర్థులయి వారందుకు జంకనూ జంకరు.
కాక, - అష్టావధాని సమర్థుడయితే యిలాంటి ఘట్టాలే పేరుతెచ్చేవి.
వొట్టి సమర్థులు కారు రామకృష్ణశాస్త్రిగా రతిసమర్థులు.
అంచేతనే ఆలాంటి రాకడ రాగలిగారు వారు.
అయితే, అవధానికి కర్మధారయలోనికి దిగిపోడం చిక్కయితే, పృచ్ఛకుడికి ఉత్తరపదాద్యక్షరం గుర్తించడమున్నూ చిక్కే.
యోగదృష్టి వుంటే తప్ప యెవరూ యేమీ చెయ్యలే రక్కడ.
కాగా, వొక్క క్షణం ఆలోచించి కానిమ్మన్నారు, మల్లయ్యశాస్త్రిగారు, ధోరణి అందక.
దాంతో, రామకృష్ణశాస్త్రి గారి మందహాసంలో ప్రగల్భత పొటమరించింది.
“బ” అన్నారు వెంటనే, బెల్లించి చూస్తూ వారు.
271
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి