Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన ప్రాప్యం మరచిపోడు.

తన లక్ష్యం మార్చుకోడు.

తన దృక్పథం మళ్ళించుకోడు.

తన ప్రణాళిక చింపేసుకోడు.

తన సాధన విరమించుకోడు.

తన దీక్ష విడిచిపెట్టుకోడు.

తన యేకాగ్రత చెరుచుకోడు.

స్థానభ్రంశం కలగనీ, నిద్రాహారాలు కరువయిపోనీ, ప్రాణభయమే తటస్థించనీ అడుగు మాత్రం ముందుకే వేస్తాడు, నిశ్చలంగా.

చివరికి జయమా అపజయమా అంటే అది వేరే సంగతి; కాని సంకల్పమూ, నిశ్చయమూ, ఆశా, ప్రతీక్షా, తపనా, ప్రయత్నమూ, ధైర్యమూ, సాహసమూ, విశ్వాసమూ, సహనమూ, దీక్షా, యేకాగ్రతా — ఇవి అతని ప్రతీ అడుగులోనూ ప్రతీ కదలికలోనూ అచ్చుకట్టివుంటాయి.

ఊపివూపిన్నీ వురికిస్తాయి, ముందుకి.

అదిగో, ఆ వికారాల విసురులే అనుభవాలు.

ఆ అనుభవాల నీడలే జ్ఞాపకాలు.

చర్మచక్షువుల కవి బులబులాగ్గా కనపడతాయి; కాని మిక్కిలీ జటిలా లయి వుంటా యవి.

"ఏముందీ వీటిలో?" అనిపిస్తాయి; కాని తరిచినకొద్దీ ప్రౌఢిమ వహిస్తాయి.

అవి నిత్యసత్యాలు, కట్టుకథల్లా మాత్రం వుంటాయి.

అవి బాధాప్లావితాలు; కాని రసబంధురా లయివుంటాయి.

కాగా:- అవి చదవడం నొక పూర్వపుణ్యం

అవి తరచడం బ్రహ్మవిద్యోపాసన.

అవి మననం చెయ్యడం మంత్ర పునశ్చరణ.

ఏవంచ:- నలుగురిలోనూ తల తిప్పుకునే మనిషి కనపడితే "ఈ మనిషి యీ స్థితి కెలా వచ్చాడూ?" అన్న జిజ్ఞాస కలుగుతుంది కొందరి కయినా, అప్రయత్నంగా.

వారి సంఖ్య తక్కువే కావచ్చు; కాని చూపు మాత్రం బహూ నిశితం అయి వుంటుంది.

ఆజిజ్ఞాస, ఆవిశిష్టత యేమిటో తెలుసుకోవాలన్న ఆవేదనకు బాహ్యరూపం.

అయితే, వారిలో చాలామంది కది జిజ్ఞాసగా మాత్రమే వుండిపోవచ్చు.

కొంతమంది కయినా తీరేదాకా అణగారిపోనిదిన్నీ కావచ్చు.

ఏమయినా, వారిలో వొక్కణ్ణయినా అది నూత్నపథానికి మళ్ళించి, ఉన్నతోన్నతశిఖరా లెక్కించకపోదు.

ఇక విశేషం యేమిటంటే?

అలాగ ఉన్నతోన్నత శిఖరా లధిరోహించడంలో, అ జిజ్ఞాసువుకి, ఆ విశిష్ఠ వ్యక్తి అనుభవాలూ జ్ఞాపకాలూ వినోదానికి వినోదమూ పుట్టిస్తాయి.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

5