Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అది వారు విద్వత్కవులు కావడం.

కేవలం పండితుడు పాఠం చెప్పడంలోనూ, పండితకవి పాఠం చెప్పడంలోనూ యెంతో వ్యత్యాసం వుంది.

రచయిత అయినవాడికే అనుభూతం కాగల విశేషం అది.

నేనక్కడికి వెళ్లేటప్పటికీ మహారాజులుంగారు పాఠం చెప్పుకుంటున్నా రది.

అందుకోసం దినమ్మూ మూడయాక కోటకి వెళ్లి, దీపాలు పెడతారనగా యింటికి వస్తూవుండేవారు రామకృష్ణకవులు.

మహారాజులుంగా రొక ప్రతి చేతబుచ్చుకుని చూస్తూనూ వింటూనూ కూచుంటే గురువులే చదివి, అర్థంచెప్పి, విశేషాలు వివరించడమూ - సందేహాలు కలిగితే మహారాజులుంగారు ప్రశ్నిస్తూ వుండడమూ - దానిమీద ముగ్గురూ చర్చ చెయ్యడమూ - ఇదీ ఆ పాఠ ప్రవచనాల పద్ధతి.

ఒక్కొక్క నాడు మిక్కిలీ రసవంతమయిన ఘట్టం ప్రసక్తం అయి, ఆ చర్చ, ఎంతో పైస్థాయిలో జరిగేదిట.

ఆవేళ యెంతో తృప్తిగానూ, యెంతో వుల్లాసంగానూ యింటికి వచ్చేవారు గురువులు.

రాగానే పుస్తకం నాచేతికిచ్చి, కోటలో వ్యాఖ్యాతం అయిన ఘట్టం చదువుకురమ్మని, భోజనానంతరం ఆ చర్చ అంతా నాకు వినిపించేవారు రామకృష్ణశాస్త్రిగారు, రాత్రి.

మొదటమొదట విని వూరుకుంటూవచ్చా న్నేను.

కొన్నాళ్ళు గడిచాక వారి ప్రోత్సాహంతో నేనూ వాదన సాగించడం ప్రారంభించాను.

ఈ విధంగా, ఆ పద్యాలమీదే, మధ్యాహ్నం కోటలో లాగే, రాత్రి యింటోనూ చర్చ జరిగేది.

ఈ కారణంవల్ల నేను గ్రంథం సక్రమంగా చదవ్వలసివచ్చింది.

ఇంకెందు కని రాత్రి నాకది పాఠం చెప్పడమే ప్రారంభించారు రామకృష్ణశాస్త్రిగారు, తరవాత.

ఈ విధానం నాకెంతో వుపకరించింది.

భాషకూ కవిత్వానికీ సంబంధించిన అనేక విషయాలతోబాటు ఆముక్తమాల్యద ఘనతా తెలిసివచ్చింది నాకు.

నా నమ్మకం యేమి టంటే?

ఆముక్తమాల్యదా, వసుచరిత్రా, శృంగార నైషధమూ, పాండురంగ మాహాత్మ్యమూ చదివి, అవగతం చేసుకుని, తన్మూలంగా ఆనందించగలగడం తెనుగువాడికి చెప్పుకోతగ్గ అదృష్టం.

అయితే, యిప్పటి యువకులు కీమాట హాస్యాస్పదంగా కనపడుతుంది.

ఇప్పుడు, తెనుగుకవిత్వం చదివి ఆనందించతలిచినవారిలో ఆముక్తమాల్యదను నల్లరాయని నిరసించేవా రెందరో వున్నారు.

వారిలో చాలామంది పట్టభద్రులు.

లేక “ఇంగ్లీషులో పట్టభద్రుల క్కంటే యెక్కువ ప్రావీణ్యం వుంది మా"కనుకునేవారున్నూ.

263

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి