Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలహానికి సంబంధించిన గ్రంథంమాత్రం రామకృష్ణశాస్త్రిగారే నడిపేవారు సాధారణంగా.

గతచరిత్రా, లోపాయికారీ వ్యవహారాలూ నాకు వివరించి చెబుతూ తత్సంబంధమైన రచన సాగించేవారు వారు.

అది తిరుపతివేంకటకవుల గ్రంథాలమీదా రాతలమీదా ఖండనలూ, ఖండనలమీద మండనలూ, యెత్తులమీద పై యెత్తులూ, కుయుక్తులమీద ముఖపిథానాలూ, బుకాయింపులమీద దబాయింపులూ - ఇలా నడిచేది కనక, భాషా మర్యాదలూ, కవిసమయాలూ, ప్రయోగవైచిత్రీ, కథా నిర్వహణంలో మెళుకువలూ, విషయవివరణలో సొగసులూ, భావప్రకటనలో లాలిత్యమూ, ఔచిత్య విచారణా - ఇలాంటి కవితా సామగ్రి అంతా అనుకున్నంతకంటే త్వరితంగానూ ఆశించినంతకంటే యెక్కువగానూ లభించేది నాకు.

తాము విమర్శించదలచిన గ్రంథభాగం చదివి నన్ను విమర్శించమనేవారు, ముందు వారు.

క్రాసుపరీక్ష ముగిశాక లాయర్లు ఆర్గ్యూమెంటు చేసేటట్టు, దానిమీద రామకృష్ణశాస్త్రిగా రొక ఉపన్యాసం సాగించేవారు.

అప్పుడప్పుడీ చర్చలో వేంకటరామశాస్త్రిగారున్నూ కలవడం వుండేది.

ఇవాళ చర్చించిన విషయానికి, తరుచు రామకృష్ణశాస్త్రిగారూ, ఎప్పుడయినా వారిద్దరూ కలిసి రేపు గ్రంథరూపం యిచ్చేవారు.

వెంటనే పత్రికలకో ముద్రాశాలకో వెళ్ళిపోయేదది.

వారిద్దరిలో వొక్కరికిన్నీ యింగ్లీషుభాషా వాసన లేశమూ లే దప్పటికి.

అయినా, మన ఆలంకారికుల్లాగ ఏకదేశంగా కాక, ఇంగ్లీషు విమర్శకుల్లాగ గ్రంథం అంతా సర్వాంగీణంగా విమర్శించేవారు రామకృష్ణశాస్త్రిగారు.

అది నాకూ పట్టుబడిందే కాస్తో.

అప్పుడే - ఆ విధంగా నా విమర్శధోరణికి నైశిత్యం అలవడింద ప్రయత్నంగా.

ఇంతకీ, - యథార్ధం చెప్పుకోవలసివస్తే, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి పద్యబంధంలో బిగి తక్కువ.

నన్నయ రచన అతివేలంగా చదివివుండిన నాకది మరీ వొదులువొదులుగా కనపడేది.

నాకే కాదు, నన్నయరచన చదివినవారికిన్ని మాత్రమే కాదు - తిక్కన్న, యెర్రన్న, శ్రీనాథుడు, సోమన్న, తిమ్మన్న, సూరన్న, భట్టుమూర్తి, రామకృష్ణుడు - మొదలైన, పూర్వకవుల రచనలేవి చదివినవారి కయినా యిలాగే తోస్తుంది.

22

నేనక్కడ ఆముక్తమాల్యద చదవడమున్నూ తటస్థించిందనుకోనిది.

పరిశీలించుకుంటూ నేనది స్వయంగా చదువుకోవడం కాదు, రామకృష్ణశాస్త్రిగారి దగ్గిర పాఠం చెప్పుకోడమే సంభవించింది.

దాల్లో వొక విశేషం కనపడింది నాకు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

262