చల్లబడిపోయాడు, చివరికి.
"మరి, తరవాత యేమిచేశాడ"ని కాదు, ప్రశ్న, బ్రాహ్మణజాతికి గౌరవావహ మేనా యిది?
21
ప్రసంగం కొంతసేపిలా జరిగేటప్పటికి, వేంకటరామశాస్త్రిగారూ రామకృష్ణశాస్త్రిగారూ కూడా నన్ను “మీ "రని మన్నిస్తూవుండడం గుర్తించాను.
“ధర్మమా?" అనిన్నీ అడిగాను.
"చాలామంది గురువులు శిష్యుణ్ణి 'వొరే' అంటారు. మాకు తెలుసు. మృదువరులు కొంద 'రేమోయ్' అనడమూ వుంది; కాని మిమ్మల్ని మేమలా కూడా అనం” అన్నారు వేంకటరామశాస్త్రిగారు.
"మీరంటే వచ్చే విప్రతిపత్తి యేమిటీ?" అనడిగారు రామకృష్ణశాస్త్రిగారు.
విద్యార్థికి గురువు పితృతుల్యుడూ, గురువుకి విద్యార్థి పుత్రసమానుడున్నూ.
ఇది మన సంప్రదాయం.
ఇందులో ఆత్మీయతే గాని, యెక్కువ తక్కువలూ సేవ్య సేవకతలూ, మానహానిమర్యాదలూ లేవు.
ఇటు పూజ్యభావమూ, అటు ఆత్మీయతా కలగడానికే యీ భావన.
ఈ ధర్మాలు నాకంటే యెక్కువే తెలిసినవారు రామకృష్ణకవులు.
అయినా, వా రామాట మానమన్నారు.
"వయస్సులో యెక్కువ తేడా లేదు. ఇప్పటికే మీరు కవి అయి వున్నారు. గ్రంథాలు రచించారు. అచ్చు వేయించారు. కొన్ని విషయాలు తెలుసుకోడానికి వచ్చారు మాదగ్గిరికి. కనక, స్నేహభావానికే యిక్కడ ఔచిత్యం" అని చెప్పి “యిక ఆ ప్రసంగం కట్టిపెట్టండి" అని ఆదేశించారు రామకృష్ణశాస్త్రిగారు.
పోతే, ఆ పూటే - తొమ్మిది దాటాక పాఠం ప్రారంభించడానికి సుముహూర్తం.
కాశీ వెడుతూ మా నాయనగారే స్థిరపరిచిన ముహూర్తం అది.
నే నీసంగతి చెప్పగా, క్షణంలో ప్రణాళిక నిర్ణయించి, తమదే ప్రతాపరుద్రీయం తెచ్చి నాచేతి కిచ్చి పాఠం చెప్పారు రామకృష్ణశాస్త్రిగారు.
ఆరంభశూరత్వం కూడదు కనక, బహూ టూకీగా చెప్పారు నాటికి.
ఆ పద్ధతి విలక్షణంగా కనపడింది.
నన్ను బాగా ఆకర్షించిందది.
నాకెప్పుడూ రామకృష్ణశాస్త్రిగారే పాఠం చెప్పేవారు.
ప్రతాపరుద్రీయంపాఠం వొక నిర్దేశం మాత్రమే.
వారు లోకాభిరామాయణం యెత్తుకుంటే అదీ వొక పాఠమే అయిపోయేది నాకు.
గురుకులవాసంలో జరిగే పఠనపాఠనాల విశిష్టతే యిది.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
260