దేని కేదీ తీసిపోదు, వొకటి రత్నమూ వొకటి కెంపూను.
కాని, వారి దృష్టిలో కాకరపర్తివారు కర్మదూరులూ, వీరి దృష్టిలో ముక్కామలవారు బహూ ఛందసులూనూ.
ఏమంటే?
ముక్కామల వేదశ్రౌతాలకు పుట్టినిల్లయితే, కాకరపర్తి తర్కవ్యాకరణాలంకార శాస్త్రాలకు ఆదిపీఠం.
ఇంకో భేదమున్నూ వుంది.
కాకరపర్తి అంతా ఆరామద్రావిడబృందమూ, ముక్కామల అంతా వెలనాటి బ్రాహ్మణపుట్టాను.
బాల్యంలో నేను తరుచుగానూ ముక్కామల వెళ్ళేవాణ్ణి, వెళ్ళినప్పుడల్లా చాలా దినాలూ వుండేవాణ్ణి.
అయితే, ముక్కామల గ్రామంలో, పీసపాటి సోమసూరీడూ, పీసపాటి వేంకటేశ్వర్లూ, పీసపాటి వేంకప్ప యాజులూ మొదలైనవారందరూ నాలాగే వైదికవిద్యలు నేర్చుకుంటున్నవారు.
నా కక్కడ వారితోనే సరిపోయేది.
అంచేత, ముక్కామల వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ గూడా కాకపర్తి పక్కగా వెళ్ళడమే గాని, వూళ్ళోకి వెళ్ళడం పడలే దొక్కమాటున్ను.
ఆ పక్కగా వెళ్ళడంలో మాత్రం వొకప్పు డొక చిత్రం జరిగిం దెప్పుడూ లేనిది.
అప్పటికప్పుడే నేను తెనుగులో రచనా చేస్తున్నాను, మా చుట్టుపట్ల కవి అనీ అనిపించుకుంటున్నాను, ధారాళంగా.
అయితే, వేషంలో మాత్రం మార్పు ప్రారంభం కాలేదు, వైదిక విద్యలూ సంస్కృత సాహిత్యమూ నేర్చుకునే విద్యార్థిలాగే వున్నాను.
ఆవేళ, తీపర్తిలో మెయిలుబోటు దిగి, అక్కడి సత్రంలో భోజనం చేసి, యెర్రవంతెనదగ్గర మళుపు తిరిగి, కాకరపర్తి పక్కగా కోడూరి కాలవగట్టే వెడుతున్నాను, నాలుగంటలు దాటాక, ముక్కామల.
కాకరపర్తికీ ముక్కామలకీ మధ్యగా - అవతలిగట్టున - అంటే పోతగట్టున, కాకరపర్తి బ్రాహ్మణయువకు లయిదారుగురు కూచుని వున్నారు.
వారిలో వొకడు "మీదే వూ?"రనడిగాడు మొదట నన్ను.
నేను చెప్పాను.
వెంటనే యేకవచనంలోకి దిగిపోయి "యెక్కడికి వెడుతున్నా?"వనడిగాడా యువకుడే మళ్ళీ.
అదీ చెప్పాను.
"ఏమి చదువుతున్నా?"వన్నాడు మరో యువకుడు.
"ఏమీ చదవడం లే"దన్నాను.
"పోనీ యింతకుముందేమి చదివా?”వనడిగాడు దీనిమీద.
"ఏమీ చదవలే”దన్నాను.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
256