Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోష్పాదమాత్రంగానే వుండడంవల్ల స్నానం చేస్తే జుట్టు ఆరదేమో అన్న భయం వుండదు కనక, చెయ్యనేవచ్చు.

మరి, చేస్తే యేం?

ఇది నావంటివాడి క్కలిగే సందేహం?

నావంటివాడికి తోచే ప్రశ్నాను.

కాని "పొద్దున్నే చెయ్యకపోతే యేం?” అనుకుంటారు, చాలామంది, కర్మిష్ఠులు కూడా.

"మరి, భోజనం చెయ్యకపోతే యేం?"

ఇదీ వొక ప్రశ్నే.

ఎవరికయినా తోచేదే యిది.

కాని కొంటె ప్రశ్నకింద కట్టేస్తారు వారిది.

కనక, వైదికుల్లో కూడా చాలామంది మాధ్యాహ్నిక భోజనాలవేళే స్నానం చేస్తారు.

తీరికూచుని యుక్తసమయాన ప్రాతస్సంధ్యావందనం యెగవేస్తారు.

సనాతన ధర్మప్రచారకుల్లో కూడా బలంగా వుందీ జబ్బిప్పటికీ.

ఇరవయ్యోశతాబ్ది గాలి సోకిన బ్రాహ్మణ కుర్రవాడి కిది స్వధర్మప్రీతి కలగనిస్తుందా?

ఉన్నదయినా నిలవనిస్తుందా?

తెనుగులో కవిత్వం చెయ్యరాదన్న నిర్బంధంతో వేగిపోతున్న నేను తిరుగుబాటు చెయ్యకుండా వుండగలనా?

ఇలాగ అనివార్యంగా వైదికాచార వైముఖ్యం యేర్పడి వుండడంవల్ల తిరపతివేంకటకవుల దగ్గిరికి వెళ్ళడం అంటే భయం పట్టుకుంది నాకు.

దీనికి సాయం, వేంకటరామకృష్ణకవుల స్థితి, తిరుపతివేంకట కవుల స్థితికి సర్వాత్మనా భిన్నంగా వుంది.

వారు కోట్లు తొడుక్కుని వున్నారు.

ఆకు చెప్పులు కాక, కాళ్ళకి స్లిప్పర్లు వేసుకుని వున్నారు.

మొగాన చుక్కబొట్టయినా లేదు, వారికి.

పైగా, బ్రహ్మసమాజ ధర్మదీక్షితులయిన పిఠాపురం మహారాజులుంగారి ఆస్థానకవులు వారు.

"రాజానుమతో ధర్మ.”

"అయితే, ఆ మహారాజులుంగారి ఆస్థానంలో, బ్రహ్మశ్రీలు, దెందుకూరి నరసింహశాస్త్రిగారూ, శ్రీపాద లక్ష్మీ నరసింహశాస్త్రిగారూ, వడలి లక్ష్మీనారాయణగారూ - ఇలాంటి వైదికాచార పరతంత్రులుండేవారు కారా?” అంటే వారితో నాకు ప్రసక్తి లేదుగా?

కనక, రామకృష్ణకవుల దగ్గిరికి వెడితే ఆచారవ్యవహారాల బాధ లేశమూ వుండదు.

ఆ బాధ వుండకపోడమే కాదు, వొక విధంగా సంస్కార దృష్టి సుపరిష్కృతమున్నూ అవుతుంది.

251

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి