వారిని మిక్కిలీ కవ్వించేది కూడా.
రామకృష్ణకవులకు సొంతపత్రిక "కవిత” వుండేది.
తక్కిన పెద్దపత్రిక లుభయులకూ అవకాశం యిచ్చేవి, సమంగా.
రచనకు - ఉద్గ్రంథ రచనకు వినియోగపడవలసిన శక్తి యుక్తు లుభయులవీ కూడా చాలాభాగం ఆ వివాదంలో చెల్లిపోయినా, అదిమాత్రం, పూనుకుని యెందరున్నూ చెయ్యలేనంత సాహిత్యప్రచారం చేసింది, దేశంలో.
దానిమూలంగా, పామరులుగా మాత్రమే వుండిపోవలసిన వారెందరో మంచి సాహిత్య ప్రియులయినారు.
ఆ సాహిత్యప్రియుల్లో యెందరో సాహిత్యవేత్తలయినారు, తరువాత.
ఆ సాహిత్యవేత్తల్లోనూ మళ్ళీ కొందరు, కవులూ రచయితలూ అయిపోయారు, చివరికి.
ఆ రోజుల్లో, ఆంధ్ర సాహిత్య వాతావరణం, చందినీ అత్తరూ గులాబీ అత్తరూ చిలకరించుకుంటున్నట్టూ, మధ్యమధ్య వట్టివేళ్ళ అత్తరువున్నూ పులుముకుంటున్నట్టూ - కమ్మకమ్మగానూ, మధురమధురంగానూ, కటువుకటువుగానూ గుబాళించేది గు - మ్ - మని.
మరి, దేశంలో, అంత కదలికా అంత పరిణతీ కలిగించిందంటే ఆ వుభయులదీ సత్తా యెంతటి దయివుండనూ?
కనక, వారిలో యెవరిని కాదని యెవరినీ ఆశ్రయించడం?
పదిపదిహేనురోజులపా టిలా సతమత మయిపోయా న్నేను.
"అయ్యో, ఆలోచనలతోనే కాలం గడిచిపోతోం”దని నాలుగైదు మాట్లు మహా ఆవేగపడిపోయానుకూడా నేను.
దాంతో, ఆ నాలుగైదుమాట్లూ “ఫలానావారి నాశ్రయిద్దాం" అంటూ నిర్ధారణ కూడా చేసుకుంటూ వచ్చాను.
కాని "తొందరపడిపోతున్నా నేమో?” అంటూ మొదటికిన్నీ వచ్చేస్తూవచ్చాను, వెంటవెంటనే.
ఒక ఆధిక్యం గుర్తించి వొకరి నెన్నుకోడం - వెంటనే మరో ఆధిక్యం కనబడగా మనస్సు రెండోవారివై పురకలు వెయ్యడం - ఇలా నడిచింది నా ప్రవృత్తి కొన్నాళ్ళు.
మొత్తానికి “ఎవరి దగ్గిరికీ వెళ్ళడం?" అన్న జిజ్ఞాస మాత్రం తప్పలేదు, లేశమూ నాకు.
అప్పటికి వేంకటశాస్త్రిగారి నొక్కమాటే చూసివున్నాను, బందరులో.
వేంకటశాస్త్రిగారి మాటే యెందుకు చెప్పానంటే, ఆ కలహంలో వారిదే ప్రాముఖ్యం.
తారతమ్యాలు తరవాత బాగా అవగాహన అయినా యనుకోండి, తిరుపతిశాస్త్రిగారిక్కంటే వేంకటశాస్త్రిగారికే శిష్యవర్గం అధికం.
లోకుల చూపున్నూ వేంకటశాస్త్రిగారిమీదే యెక్కువ.
రాజా శ్రీ వాడ్రేవు విశ్వసుందరరావు బహద్దరువారి వివాహం సందర్భంలో బందరులోనే చూశా న్నేను, వేంకటశాస్త్రిగారిని.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
248