అప్పుడే కాదు, మొన్నటిదాకా "ఆంధ్రపత్రిక సంవత్సరాదిసంచిక" కోసం అర్రులు చాచుకుని వుండేది ఆంధ్రలోకం.
ఆంధ్రపత్రికలోనే వుంది, అస లావిశేషం.
ఇప్పటికిన్నీ ఆంధ్రపత్రికలో ప్రతిబింబించినంతగా మరే తెనుగు పత్రికలోనూ ప్రతిబింబించడంలే దాంధ్రదేశం.
నాగేశ్వరరావుపంతులుగారి దృక్పథానికి ధ్రువతార అది.
నాగేశ్వరరావుపంతులుగారి నిష్కామసేవకు జయపతాక అది.
ఆ మొదటి సంవత్సరాదిసంచికలో యెందరివో ఫొటోలున్నా యాంధ్ర మహాకవులవి.
ఆ ఫొటోలకు సంబంధించిన వివరాలూ వున్నాయి.
చూడగా చూడగా, మథనపడగా మథనపడగా, “మంచికవి” అనిపించుకోవాలని వున్న సాధకునకు, వారందరిలోనూ, అటు తిరుపతివేంకటకవులో యిటు రామకృష్ణకవులో మాత్రమే ఆశ్రయించతగ్గవారన్న నిశ్చయం కలిగింది నాకు.
అయితే, ఆ వుభయుల మధ్యా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేస్తోం దప్పటికే.
కాగా, వారిలో యెవరి దగ్గిర ప్రవేశించినా ఆ యుద్ధంలో వురకడమే అవుతుంది.
నా కది శ్రేయస్కరమా?
"అయితే అయింది లేకుంటే లే"దనుకుందా మంటే, మరి, తిరుపతి వేంకటకవుల దగ్గిరికి వెళ్ళడమా రామకృష్ణకవుల దగ్గిరికి వెళ్ళడమా?
మళ్ళీ యి దొక గడ్డుసమస్య అయిపోయింది నాకు.
ఇది తేల్చుకోడానికి పదిపదిహేను దినాలు కవితా సాధన కూడా అశ్రద్ధ చేసుకోవలసివచ్చింది.
“సహసా విదధీత న క్రియాం" మరి.
15
అప్పటికి కొన్ని దశాబ్దులుగా తిరుపతివేంకటకవుల ప్రభ వెలుగుతోంది, అవిచ్ఛిన్నంగా.
అప్పు డప్పుడే ప్రారంభం అయినా, రామకృష్ణకవులు ప్రభ ఆ యెత్తునే వెలిగిపోతోంది, కొత్తవిన్నాణంతో.
చిరప్రతిష్ఠ దాని విశిష్టత అయితే, నవనవోన్మేషం దీని విశిష్టత.
బాగానే వుంది మరి, యెవరిని కాదని యెవరినీ నే నాశ్రయించడం?
ప్రాజ్ఞత రాకపూర్వం అయితే నాకీ గుంజాటన కలక్కపోవును.
వారుభయులూ కజ్ఞాపెంచుకుని వుండకపోయినా నాకీతటపటాయింపు లేకపోవును.
పోనీ అంటే, మహాసంగ్రామం కాని కీచులాట మాత్రమే కాదది.
జాతికి వికాసం కలిగించేదే అయింది; గాని సంహారం చేసేది మాత్రం కా లేదది.
ఇప్పటి యువకులు దాని పరిమితీ వ్యాప్తీ జటిలతా తెలుసుకోవాలంటే, యిటీవలి ప్రపంచ సంగ్రామం యెత్తున ఆంధ్ర మహాసంగ్రామం అయిపోయిం దది, ఆ రోజుల్లో.
స్థూలదృష్టికి వైయక్తికం, సూక్ష్మదృష్టికి మాత్రం జాతి స్తబ్ధతమీద బాగా సంఘటితమైన దండయాత్ర అది.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
246