Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమంటే?

గతం పరిశోధించుకునీ, వర్తమానం సమన్వయించుకునీ, భవిష్యత్తు నిర్ధారణగా రూపించుకోడమూ, అందుకు తగ్గ వొక ప్రణాళిక వేసుకుని జాతిని ఆమార్గాన నడిపించడమూ — ఇవీ సంపాదకుని ముఖ్యవిధులు.

రాగద్వేషాలూ, ఇష్టానిష్టాలూ, ఈర్ష్యాసూయలూ, స్వపరభేదభావాలూ — ఇవి సంపాదకులకు పతన హేతువులున్నూ.

పై పెచ్చు, — తమ ధర్మం నిర్వర్తించుకోవాలనుకోగలిగిన సంపాదకులకు వేత్తల ననువర్తించడమే రాజమార్గం కాని శుష్క — పాక్షిక — రాజకీయాళ్లో దిగబడి ప్రజల క్షేమం అప్రధానం చేసుకున్న అపరిణతబుద్ధుల కాళ్లు పట్టుకుని యీడిగిలపడ్డం కాదు.

ఎంచేతనంటే?

రాజకీయాలకు సత్యం లేదు, ధర్మమూ లేదు.

స్వార్థం తప్ప మరేమీ కూడా లేదు.

అధికారమే వాటికి ప్రాప్యం.

ఆసుడిగుండంలో పడిపోయినవారికి చెవులు వినలేవు, కళ్ళు చూడాలేవు. వారి మనస్సుకి నిగ్రహశక్తి వుండదు, బుద్ధికి గ్రహణపరాయణతా వుండదు. గుండెలుండనే వుండవు వారికి.

వారి అడుగులకు మడుగు లొగ్గేవారి సంగతి యిక చెప్పడానికేమి వుందీ?

తత్వం పరిశీలించుకోగలిగితే రాజకీయాలు, కలసివున్న — అధవా కలిసివుండదగినవారిని విడదీస్తాయి.

రాజకీయాల్లో దిగితే అతీతు లయినవారు గాని ఈ అపాయం తప్పించుకోలేరు.

ఏమయినా, పత్రికాసంపాదకుల అంతస్థు, రాజకీయాల్లో పనిచేసేవారి అంతస్థు కెంతో పైది.

ఈ రహస్యం తెలియనిచోట పత్రికాసంపాదకత్వానికి లేశమూ అర్హత లేదు.

ఈ అర్హత లేనిచేతుల్లోపడ్డ పత్రికలు జాతీయతనూ రూపొందించలేవు.

1

ఆహారనిద్రాభయాదులు మనుష్యమాత్రుల కందరికీ సమానాలే; గాని వారిలో కొందరికి మాత్రమే నిశితదృక్కూ, విశిష్టశక్తీ వుంటాయి, నిగూఢంగా.

ఆవుండినవారిలో నయినా కొందరే ఆసంగతి గుర్తించుకోగలుగుతారు.

అలా గుర్తించుకోగలిగినవారిలోనున్నూ మళ్ళీ కొందరే వినియోగపరుచుకోడానికి ప్రయత్నిస్తారు.

ఆప్రయత్నంలో విజయం పొందేవారున్నూ కొందరే అయితే, ఆ పూనిక వుండడమున్నూ కొంత విశేషమే.

ఏమంటే, తామెత్తిన మనుష్యజన్మ అంతర్యం అలా ప్రయత్నించేవారికే అవగాహన అవుతుంది, మరి.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

3