Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఎక్కడో వొకచోట ప్రవేశించు. అక్కడ ప్రయోజనం కనపడకపోతే మరోచోటికి వెళ్ళు. కూపకూర్మంగా పొలమూరిలో కూచుంటే తేలేవిషయం కా దిది" అని సలహా చెప్పారు, మంగిపూడి వేంకటశర్మగారు.

నాకు తృప్తికాలేదు.

వేదం వేంకటరాయశాస్త్రిగారి దగ్గిరికి వెళ్ళమన్నాడు, నత్తి సుబ్బారాయడనే వొక రెడ్డి.

మా వూరే అతనిది.

అప్పుడు, వేంకటరాయశాస్త్రిగారు పరిష్కరించి లఘుటీక కూడా రాసి ప్రకటించిన విజయవిలాసం చదువుతున్నా డతను.

మద్రాసే వెడితే కొత్త దృక్పథం యేర్పడి కొత్తదారిలో ప్రవేశం కలుగుతుంది; కాని "మద్రాసే వెళ్ళడం?"

అది చంద్రలోకంవంటి అసాధ్యం అని అప్పుడు జనుల నమ్మకం.

సాహసించలేకపోయాను.

ఇంతకీ :-

“సుపరీక్షితశిష్యాయ దేయం వత్సరవాసినే" అన్నాడు, సూర్యసిద్దాంతకారుడు.

“ఒక్క సంవత్సరంపాటు ప్రవృత్తి పరీక్షించిగాని యెవరికీ యీ శాస్త్రం ఉపదేశించవద్దు" అని అతని ముదల.

ఇది జ్యోతిశ్శాస్త్రం విషయం.

వికటబుద్ధుల కాశాస్త్రం తెలియకుండా వుండడాని కీజాగ్రత్త.

పండితులను బట్టి విద్యలకు గౌరవమూ వస్తుంది, అగౌరవమూ చుట్టబెట్టుతుంది, మరి.

ఇతరవిద్యల విషయమయ్యిన్నీ గురువు లిలా పరీక్షించే సంప్రదాయం లేకపోలేదు.

మరి గురువుల విషయం?

ఇదీ చూసుకోవలసిందే శిష్యుడు.

గురుత్వం చేస్తున్నవారిలోనూ అప్రామాణికు లున్నారెందరో.

ఆకతాయిలూ వున్నారు.

మర్మం విడిచి చెప్పనివారుండనే వున్నారు.

కాని లోకం నాకేమి తెలుసూ, యేగురు వెలాంటివాడో గుర్తించగలగడానికీ?

మరేమిటీ చెయ్యడం?

దీంతో గూడా నిద్రాహారాలు కరువయిపోయాయి నాకు.

పూర్తిగా అయోమయావస్థలో పడిపోయాను.

ఈ స్థితిలో వచ్చింది ఆంధ్రపత్రిక మొదటి సంవత్సరాది సంచిక, ఆంధ్రవాఙ్మయాని కొక కొత్త భూష అయి.

అది చూసుకుని "కొత్త ప్రపంచంలో పడ్డా”మని సంబరపడ్డారు చాలామంది ఆంధ్రసాహిత్యపరులు.

నిజంగా, నాకే కాదు, జాతి మొత్తానికే యెంతో మేలు చేసిం దారోజుల్లో అది.

245

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి