Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వదేవుడుగారి చెలగాటంవల్ల దుర్వినియోగం అయిపోయిం దది.

"బూడిదలో చేసిన హోమం” అన్న సామెతకు సరి అయిన సన్నివేశం అది.

చేతులారా జారవిడుచుకున్న ట్టయింది అందిన ఫలం.

లక్ష రూపాయలు పోయినా అంత బాధగా వుండదు.

కనక, సంతతపరిశ్రమ చేసి ఆ కాలం విలవ అయినా కూడదీసుకోవాలని నిశ్చయించుకున్నాను.

సంగీతం విషయం యిలా పర్యవసించినా అందుకోసం ప్రయత్నించడంలో కవితా సాధన చేసుకోడంలో మా నాయనగారు చూపించే ప్రాతికూల్యం పూర్తిగా తొలగిపోడం స్పష్టం అయింది నాకు.

ఎస్టేటు స్వాధీనం అయిన పిల్లజమీందారు స్థితి అది.

ఈ సావకాశం చూసుకుని రాత్రీ పగలూ కూడా కవితా సాధనలో మునిగిపోయా న్నేను.

యమ సాధనే చేశాను.

అయితే, పద్యబంధం సాపుతేరినకొద్దీ యేదో లోటుంటున్నట్టూ, యేదో వెలితి యేర్పడుతున్నట్టూ మనస్సు పీకేది.

నేలవిడిచిన సాముగానున్నూ కనపడేది.

పరకాయించుకోగా, నా కవిత్వం పెద్దలకున్నూ ఆదరపాత్రం కావాలంటే, నేను చదువుకోవలసిన గ్రంథం మరికొంత వుందనీ, గ్రహించవలసిన కవిసమయాలూ, తెలుసుకోవలసిన సంప్రదాయాలూ కూడా చాలా వున్నాయనీ తట్టింది నాకు.

ఉపదేశం లేనిదే - సొంత పరిశ్రమతో అవి స్వాధీనపడేవి కావనిన్నీ అవగాహన అయింది.

కొన్ని సాధ్యపడతాయి, సందేహం లేదు.

కాని, అవి నిష్కృష్టా లవునో కాదో అన్న సంశయం వొకటి ప్రారంభం అవుతుంది, దాంతో.

ఎవరి నయినా అడిగి ఆ సందేహాలు తీర్చుకుంటూ వుండవచ్చు; కాని ఆ ఝడితిశ్రవణం బాగా మనస్సుకి పట్టకపోవచ్చు.

అంతా కలతగొట్టుపాండిత్యం అయిపోతుంది చివరికి.

ఆ స్థితి పగవాడికిన్నీ వద్దనిపించింది.

కనక, ఆ లోట్లు తీర్చుకోవాలంటే, గొప్ప పండితుడూ మహాకవి అయిన యే మహానుభావుణ్ణో ఆశ్రయించాలి.

కవిత్వమే నాకు జీవితపరమావధి అయిపోయింది కనక ఆశ్రయించవలసిందే; అయితే, యెవ రామహానుభావుడు?

ఇదొక సమస్య అయింది నాకు.

14

తెలిసినవారి నడిగా నెందరినో; కాని వారు ప్రశంసించినవారిని వీరూ, వీరు గొప్పచేసినవారిని వారూ తీసిపారెయ్యసాగారు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

244