Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కుసోమయాజులుగారు.

"క్రియాసిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే."

కనక, ఆ అసమగ్ర గ్రంథంతోనే ఆశ్వినం సాధించారు, మా నాయనగారు.

యనమండ్ర సుబ్బావధానులుగా రని ముక్కామల గ్రామంలో మరో బ్రహ్మణ్యులు.

ఋగ్వేదులు వారు.

తమ వేదం అంతా క్షుణ్ణంగా వచ్చినవారున్నూ.

అత్తవారింటికి ముక్కామల వెడుతూ వస్తూ వుండడంలో మా నాయనగారికీ ఆయనకూ చిరమైత్రి.

ఆయనచేత చెప్పించుకుని మా నాయనగారు, ఆ వరసన రుక్కులన్నీ పూర్తిగా రాసుకున్నారు.

తరవాత పగలని లేదు, రాత్రని లేదు వొకటే వల్లన.

ఆశ్వినం ఋగ్వేదంలోదే అయినా - ఉదాత్తానుదాత్త స్వరితాలతో దానికి నియతమైన వొక స్వరం వుండినా - చయనంలో ఉచ్చైస్వరంతోనే దానికి వినియోగం.

శ్రౌతం వచ్చివుండినవారి కది సుపరిచితమే, దానికోసం సంతలు చెప్పుకోనక్కరలేదు.

కాగా, - సకృదావృత్తిగా కాక పారాయణ ప్రారంభించారు ముం దది.

నలిగాక వల్లెలున్నూ ప్రారంభించారు.

ఇక కూచుని వల్లె, నడుస్తూ వల్లె, చివరికి పడుకునిన్నీ వల్లె.

ఆ వల్లనలో ఒక విశేషం.

ఇంటోకల్లా పిన్నలు కావడంవల్ల, విస్తరాకులూ కూరలూ వగైరా సమకూర్చవలసిన విధి మా నాయనగారిది.

మునికొడవలి ప్రాంతంవారు ఉప్పుతో తొమ్మిదిరసాలూ రాజమహేంద్రవరం వెళ్లే కొనుక్కోడం ఆరోజుల్లో.

బీదలదీ సాదలదీ కూడా అప్పు డందరిదీ వొకటే అంతస్థు ఇలాంటి సందర్భాల్లో.

ఎక్కడికి బయలుదేరినా, వెళ్ళాటప్పుడూ వచ్చాటప్పుడూ కూడా యేదోవొకటి వల్లించుకుంటూ వుండడం మా నాయనగారి కలవాటు.

వేదశ్రౌతాలు నేర్చేవారందరూ యింతే, అప్పటికీ యిప్పటికీ యెప్పటికీ.

ఈ అలవాటుతో, అది వల్లించేటప్పుడు రాజమహేంద్రవరం ప్రయాణం తగిలితే, తెల్లవారగట్ల బయలుదేరడమూ, చీకటి వుండినంతసేపూ వచ్చివుండిన గ్రంథం యేకరువు పెట్టుకోడమూ, తూర్పు తెల్లవారుతోందనగా కోటిలింగాలు చేరుకుని అక్కడ దంతధావనాదికం కానిచ్చుకోడమూ, అప్పుడు బజారుకి వెళ్లి కావలసిన సామగ్రి కొనుక్కుని గుమ్మడిమూట కట్టి నెత్తిన పెట్టుకునీ పుస్తకం విప్పి వొకచేత పట్టుకునీ కొత్త గ్రంథం వల్లెవేసుకుంటూ వెనక్కి బయలుదేరడమూ - రమారమీ పాతికమైళ్లు నడిచి భోజనాలవేళ కిల్లు చేరుకోడమూ - ఇలాగ వల్లించా రది మా నాయనగారు.

విద్యాపిపాస అంటూ వున్నచోట దీక్షకూ యేకాగ్రతకూ ఇంతకంటే పారమ్యం యేమి వుంటుందీ?

ఇలా సాధన చేస్తే విద్యలు రాకపోడమున్నూ యేమిటి?

241

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి